సైబర్‌ వలలో సిటీజన్లు!

28 Apr, 2020 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేర్వేరు సంఘటనలో మోసపోయిన ముగ్గురు

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన నైజీరియన్‌ వలలో కుమారుడి బీమా డబ్బు పోగొట్టుకున్న తల్లి

రూ.17 వేలకు వాహనం కొనబోయి రూ.37వేలు పోగొట్టుకున్న యువకుడు

రూ.1500 వస్తాయనుకొని రూ.64 వేలు పోగొట్టుకున్న మరో వ్యక్తి

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ సమయంలోనూ సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు తగ్గట్లేదు. అనేక రకాలుగా ఎర వేసి నగరవాసుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. నగరంలో వేర్వేరు సంఘటనలో ముగ్గరుని ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో నగదును కాజేశారు.

కుమారుడి బీమా డబ్బు పోగొట్టుకున్న తల్లి
నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేక్‌బుక్‌ ద్వారా వల వేసిన సైబర్‌ నేరగాళ్ళు ఆమె నుంచి రూ.9.55 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ మధ్య తరగతి మహిళ కుమారుడు కొన్నాళ్ళ క్రితం మరణించారు. అతడు అవివాహితుడు కావడంతో పాటు జీవిత బీమాకు తల్లి నామినీగా ఉండటంతో ఆ సొమ్ము తల్లి ఖాతాలోకి వచ్చింది. ఈమెకు గత ఏడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌ ద్వారా జిమ్‌ జే అనే పేరు చెప్పుకున్న నైజీరియన్‌ పరిచయమయ్యాడు. తాను లండన్‌లో ఉంటానని, వ్యాపారం చేస్తుంటానని నైజీరియన్‌ నమ్మబలికాడు. ఓ రోజు తాను ఇండియా వస్తున్నానని, మన స్నేహానికి గుర్తుగా ఓ బహుమతి తీసుకువస్తున్నానంటూ చెప్పాడు. ఇది జరిగిన రెండో రోజు తాను న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నట్లు ఫోన్‌ చేశాడు. తన వెంట బహుమతిగా తీసుకువచ్చిన వజ్రాలు, పౌండ్లు ఉన్నాయని, వీటి విలువ రూ.కోట్లలో ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు.

తనను విడిచిపెట్టాలంటే పన్నుగా రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉందంటూ నమ్మబలికి ఆమెకు ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపి అందులో డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఆ వెంటనే కస్టమ్స్‌ అధికారులు తనను విడిచిపెట్టారని, బహుమతిగా తెచ్చినవి మాత్రం సీజ్‌ చేశారని నమ్మించాడు. ఇది జనవరిలో జరగ్గా... ఇటీవల నిందితుడు మళ్లీ బాధితురాలికి ఫోన్‌ చేసి అప్పుగా తీసుకున్న రూ.1.8 లక్షలు త్వరలోనే తిరిగి పంపిస్తానన్నాడు. స్వాధీనం చేసుకున్న వజ్రాలు, పౌండ్లు తనకు తిరిగి ఇవ్వడానికి కస్టమ్స్‌ అధికారులు అంగీకరించట్లేదని, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్వారా భారతీయుడి ఖాతాలోకే వేస్తామని చెప్పారని పేర్కొన్నాడు. ఈ మాటలకు ఆమె ఆశ పడటంతో.. మీ బ్యాంకు ఖాతాలోకి ఆ డబ్బు రావాలంటే కొన్ని పన్నులు చెల్లించాలని ఆమె నమ్మించి మరో మూడు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి మరికొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఇలా మొత్తం రూ.9.55 లక్షలు ఆమె నుంచి కాజేయడంతో తాను మోసపోతున్నట్లు ఆమెకు అనుమానం వచ్చింది. అప్పటి వరకు భర్తకు చెప్పకుండా కుమారుడి ఇన్సూరెన్స్‌ ద్వారా వచ్చిన సొమ్ము దారాదత్తం చేసిన ఆమె చివరకు నోరు విప్పింది. సోమవారం జరిగినదంతా భర్తకు చెప్పడంతో ఆయన సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు తీసుకువచ్చారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కుమారుడి ఇన్సూరెన్స్‌ సొమ్ము పోగొట్టుకున్న ఈ మధ్య తరగతి భార్యాభర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మార్కెట్‌ ప్లేస్‌ ద్వారా మోసపోయిన యువకుడు!
ద్విచక్ర వాహనం ఖరీదు చేయడానికి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసిన యువకుడు సైబర్‌ నేరగాళ్ళ వలలో పడ్డాడు. తనకు నచ్చిన సెకండ్‌ హ్యాండ్‌ హోండా యాక్టివాను రూ.17 వేలకు కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ నేరగాళ్ళ మాటలు నమ్మి రూ.37వేలు చెల్లించి చేతులు కాల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే... జియాగూడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా మటన్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. తాను సంచరించడానికి ఓ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ ఖరీదు చేయాలని భావించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశాడు. చివరకు ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ ప్లేస్‌లో కనిపించిన హోండా యాక్టివా ఇతడికి నచ్చడంతో అక్కడ ఉన్న ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాడు. సమాధానం ఇచ్చిన అవతలి వ్యక్తి తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు నమ్మించి సదరు వాహనాన్ని రూ.17 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ.3,100 ఫోన్‌ పే ద్వారా తీసుకున్న ఇతగాడు వాహనాన్ని కొరియర్‌ ద్వారా పంపుతానని, రిసీవ్‌ చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం చెల్లించాలని సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత కొరియర్‌ బాయ్‌ని అంటూ మరో వ్యక్తి కాల్‌ చేసి తాను శంషాబాద్‌ విమానాశ్రయం సమీపం నుంచి మాట్లాడుతున్నానని, కొరియర్‌ ద్వారా హోండా యాక్టివా వచ్చిందని, అయితే దాన్ని డెలివరీ ఇవ్వడానికి కొన్న రకాలైన ట్యాక్స్‌లు, సెస్‌లు చెల్లించాలని నమ్మబలికాడు. ఈ చెల్లింపులన్నీ కేవలం ఫార్మాలీటీ అని, వాహనంతో పాటు మొత్తం రిఫండ్‌ వస్తుందని చెప్పాడు. దీంతో బాధితుడు దఫదఫాలుగా రూ.37,200 చెల్లించాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించి సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు ప్రారంభించారు.

అమ్మాలనుకొని అడ్డంగా మునిగాడు...
నగరంలోని బజార్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి ఓఎల్‌ఎక్స్‌ ద్వారా క్యారంబోర్డ్‌ అమ్మాలని భావించి సైబర్‌ నేరగాళ్ళకు అడ్డంగా దొరికేశాడు. స్థానికంగా చిరు వ్యాపారం చేసే ఈ యువకుడు తన ఇంట్లో ఉన్న క్యారంబోర్డును విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో తన నెంబర్‌తో సహా పోస్టు చేశాడు. ఇది చూసిన సైబర్‌ నేరగాడు తాను రూ.1500కు ఖరీదు చేస్తానంటూ కాల్‌ చేసి డబ్బును గూగుల్‌ పే ద్వారా పంపిస్తున్నానని చెప్పాడు. తాను పంపే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలని ఆపై ప్రొసీడ్‌ టు పే నొక్కితే సొమ్ము మీ ఖాతాలోకి వస్తుందని నమ్మించాడు. బాధితుడు అలాగే చేయగా... ఇతడి ఖాతాలోని డబ్బు సైబర్‌ నేరగాడికి వెళ్ళింది. ఈ విషయం అతడికి ఫోన్‌ చేసిన చెప్పగా... అది సాంకేతిక సమస్య అంటూ చెప్పిన అతగాడు మరో కోడ్‌ పంపిస్తున్నానని, దీని ద్వారా మొత్తం వచ్చేస్తుందని చెప్పాడు. ఇలా మొత్తం ఆరు సార్లు బాధితుడితో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయించిన సైబర్‌ నేరగాళ్ళు మొత్తం రూ.63,998 కాజేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు