బండి పేరుతో బాదేశారు..

17 Mar, 2020 10:19 IST|Sakshi
బాధితుడికి సైబర్‌ నేరగాళ్లు పంపిన ఫొటో

రూ.20 వేల బండికి రూ.55 వేలు స్వాహా

నగర వాసికి టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు

బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌ ఠాణాలో కేసు

సాక్షి, సిటీబ్యూరో: సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో పోస్ట్‌ చేయడం... ఆకర్షితులై స్పందించిన వారి నుంచి అడ్వాన్సుల పేరుతో అందినంతా కాజేయడం... ఇప్పటి వరకు ఈ పంథాలో రెచ్చిపోయిన ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. నైజీరియన్లు మాదిరిగా ఈ వ్యవహారాల కేసుల్లో ట్విస్ట్‌లు తీసుకువస్తున్నారు. ఈ పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు స్వాహా చేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో రూ.20 వేలకు ఓ వాహనం ఖరీదు చేద్దామంటూ భావించి, సంప్రదింపులు ప్రారంభించిన బాధితుడు రూ.55 వేలు పోగొట్టుకున్నాడు. సైబర్‌ నేరగాళ్లు మరో రూ.5 వేలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేస్తుండటంతో సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్లగొండకు చెందిన ఓ యువకుడు బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

తాను తిరిగేందుకు ఓ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ ఖరీదు చేయాలని భావించిన సదరు యువకుడు దాని కోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్‌ చేశాడు. విజయవాడలో పని చేస్తున్న ఆర్మీ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్‌కు ఆకర్షితులయ్యాడు. అతడిని సంప్రదించి, బేరసారాలు పూర్తి చేసిన తర్వాత రూ.20 వేలకు సదరు ద్విచక్ర వాహనాన్ని ఖరీదు చేయడానికి సిద్ధమయ్యాడు. ఓ సందర్భంలో బాధితుడితో ఫోన్‌లో మాట్లాడిన నిందితుడు తాను ప్రస్తుతం సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో (సీఐఎస్‌ఎఫ్‌) పని చేస్తున్నానని, విజయవాడ విమానాశ్రయంలో డ్యూటీ చేస్తున్నానని నమ్మించాడు. రూ.20 వేలను గూగుల్‌ పే ద్వారా పంపితే వాహనాన్ని పార్శిల్‌ చేస్తానంటూ చెప్పి తన గుర్తింపుకార్డులు అంటూ నకిలీవి పంపించాడు.

అతడి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. ఇది జరిగిన తర్వాతి రోజు ఓ వాహనాన్ని పార్శిల్‌ చేస్తున్న ఫొటోను కూడా వాట్సాప్‌ ద్వారా పంపించాడు. ఆ రెండు రోజులకు మళ్లీ బాధితుడికి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు వాహనం పార్శిల్‌ను విజయవాడలో రైల్వే పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. పూర్తి స్థాయి క్లియరెన్స్‌ లేకుండా ఆర్మీ వాహనాన్ని బయటకు పంపిస్తున్నందుకు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. అర్జంటుగా రూ.35 వేలు చెల్లించకపోతే నీ మీద కూడా కేసు నమోదు చేస్తారని భయపెట్టాడు. ఈ మాటల వల్లో పడిన బాధితుడు మరో రూ.35 వేలు గూగుల్‌ పే ద్వారా పంపాడు. అప్పటికీ ఆగకుండా మరో రూ.5 వేలు కావాలంటూ ఫోన్లు చేస్తుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బా«ధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు