సైబరాబాద్‌కు సలామ్‌..

28 Aug, 2019 11:34 IST|Sakshi

వైట్‌ కాలర్‌ నేరాలపై ఏడాదిగా ఉక్కుపాదం

రూ.వేల కోట్ల మోసాలు వెలుగులోకి నిందితుల అరెస్టు

క్యూనెట్‌ కేసులో పురోగతితో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌కు ప్రశంసలు

సైబరాబాద్‌ సీపీ మార్గదర్శనంతోనే సత్ఫలితాలు

సాక్షి, సిటీబ్యూరో: ఒక్క వైట్‌ కాలర్‌ క్రైమ్‌ ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసేస్తుంది. ఈ తరహా ఆర్థిక నేరాలను నియంత్రించేందుకుగాను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మార్గదర్శనంలో దాదాపు ఏడాది క్రితం ప్రారంభించిన సైబరాబాద్‌ ఎకనామిక్స్‌ ఆఫెన్స్‌ వింగ్‌ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. ముఖ్యంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలపై ఉక్కుపాదం మోపుతోంది. రూ. 50 లక్షలకు పైబడిన బ్యాంక్, చిట్‌ ఫండ్‌ మోసాలు, నకిలీ వీసాలు, పాస్‌పోర్టు కేసులు, ఆర్థిక నేరాల కేసులు, ఉద్యోగ మోసాలు, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన వారి వ్యథలను చెబుతూనే ప్రజలను చైతన్యం చేయడంలో సఫలీకృతమైన  సైబరాబాద్‌ ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌ దేశాన్ని ఊపేసిన క్యూనెట్‌ అనుబంధ ఫ్రాంచైజీల ఆటకట్టించడంలో విజయం సాధించింది. ఒక్క సైబరాబాద్‌లోనే 38 కేసులు నమోదైన క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహన్‌ డైరెక్ట్‌ సేలింగ్‌ కంపెనీ కేసులో ఇప్పటికే 70మందిని అరెస్టు చేసి, రూ.2.7 కోట్ల బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ కంపెనీపై పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకొని మూసివేత దిశగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ చరిత్రలోనే ఈ కేసుతో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఇతర కేసుల్లోనూ ఇదే «ధోరణితో ముందుకెళతామని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొంటున్నారు. 

ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ చేధించిన కేసులివీ...
కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీటూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీల ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని భారీ ప్రచారం చేసి  650 మందిని మోసం చేశారు. బేగంబజార్‌లో కిలో రూ.38 చొప్పున కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్‌గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందికి టోకరా వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పల మల్లిఖార్జున ముఠాను ఆగస్టులో అరెస్టు చేసింది.  
మునక్కాయల పొడిని వాడటం వల్ల అనతికాలంలోనే బరువు తగ్గి ఆరోగ్యకంగా ఉండొచ్చంటూ ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ గ్లోబల్‌ (ఎఫ్‌ఎంఎల్‌సీ) కంపెనీ ప్రచారం చేసి తమ సంస్థల్లో చేరిన ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూలు చేసి నాణ్యతలేని ఉత్పత్తులను పంపిణీ చేసింది. మరో ముగ్గురిని చేర్పిస్తే కమీషన్‌ రావడంతో పాటు మీరు చెల్లించిన డబ్బులు మీ జేబులోకి వస్తాయని, అనతికాలంలోనే లక్షాధికారులు కావొచ్చంటూ అంకెల గారడీ చేయడంతో 60 లక్షల మంది కంపెనీ జాబితాలో చేరిపోయారు. దీనిపై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా రూ.3 వేల కోట్ల మోసం వెలుగులోకి వచ్చింది. గత సెప్టెంబర్‌ 8న సదరు కంపెనీ చైర్మన్, మేజేజింగ్‌ డైరెక్టర్‌ రాధేశ్యామ్‌తో పాటు బన్సీలాల్‌ను అరెస్టు చేశారు.  
క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ డైరెక్ట్‌ సేలింగ్‌ కంపెనీ తమ సంస్థలో రూ.7 నుంచి రూ.10వేల లోపు డబ్బులు చెల్లించి చేరితే ఆరోగ్యకర ఉత్పత్తులు, లేదా కాస్మోటిక్స్, వాచ్‌లు ఆ ధరకే వస్తాయి. మీరు మరో ముగ్గురిని చేర్పిస్తే కమీషన్ల రూపంలో మీ డబ్బులు మీకు వస్తాయని, ఇలాగే కొనసాగిస్తే అనతికాలంలో లక్షలు సంపాదించవచ్చంటూ ప్రచారం చేసి పలువురిని మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో జనవరి 8న ఆ సంస్థకు చెందిన 58 మంది ప్రతినిథులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన సెలబ్రిటీలకు సైతం నోటీసులు జారీ చేశారు.  
2001 నుంచి ఈ–లెర్నింగ్, ఫ్యాషన్‌ దుస్తులు, హలీడే ట్రిప్‌ పేరిట 17 లక్షల మందిని మోసగించి రూ.ఐదువేల కోట్ల మోసం వరకు చేశారన్న అభియోగాలపై ఆ కంపెనీ డైరెక్టర్‌ పవన్‌ మల్హన్, అతని కుమారుడు హితిక్‌ మల్హన్‌ను మంగళవారం అరెస్టు చేశారు.  

ఆనందంగా ఉంది
అతి తక్కువ సమయంలోనే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇందుకు షార్ట్‌కట్‌లు కూడా ఏమీ ఉండవు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో చేరాలంటూ కబురు అందితే తిరస్కరించండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది ఎంఎల్‌ఎం మోసమైతే పోలీసుల దృష్టికి తీసుకురండి. తాము చేరడమే కాకుండా వందలాది మందిని గొలుసుకట్టు పథకంలో చేర్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహన్‌ డైరెక్ట్‌ సేలింగ్‌ కంపెనీ విషయంలో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది.– వీసీ సజ్జనార్,సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు