5 నిమిషాలు.. 20 ఏళ్ల కష్టాన్ని మింగేసింది

20 Jun, 2020 17:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాక్సిడెంట్‌.. రోడ్డు ప్రమాదం భాష ఏదైనా కానీ.. దాని ఫలితంగా ఓ కుటుంబం వీధిన పడుతుంది. ఐదు నిమిషాల కాలం ఓ కుటుంబం తలరాతను తిరగ రాస్తుంది. రోడ్డు మీద వెళ్లేవారైనా.. వాహనాల్లో ప్రయాణం చేసేవారైనా ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే.. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కాపాడినవారు అవుతారు అంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఈ క్రమంలో వారు షేర్‌ చేసిన ఓ కథనం ఆలోచింపజేస్తుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాపయ్య అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.  పిల్లల భవిష్యత్తు గురించి అనేక కలలు కంటూ 20 ఏళ్ల క్రితం భాగ్యనగరానికి వలస వచ్చాడు పాపయ్య. ఈ క్రమంలో పేట్‌ బషీరాబాద్‌లోని ఒక స్వీట్‌ షాప్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనికి కుదిరాడు. అదే ఉద్యోగంలో ఉంటూనే ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు.. కొడుకును ఇంటర్‌ వరకు చదివించాడు. 20 ఏళ్ల క్రితం ఏ కల కని మహానగరానికి వచ్చాడో.. ఆ కలను నేరవేర్చుకున్నాడు. అనుకున్నట్లుగానే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చానని సంతోషించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పాపయ్య యాక్సిడెంట్‌కు గురయ్యాడు

పేపర్‌ కోసమని వెళ్లి...
ప్రతిరోజు ఉదయాన్నే పేపర్‌ చదివే అలవాటు ఉన్న పాపయ్య ఎప్పటిలాగే ఈ నెల 16న ఉదయం 8.30గంటలకు జీడిమెట్ల గ్రామంలోని గాంధీ బొమ్మ(పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి) దగ్గర పేపర్‌ తెచ్చుకోవడానికని రోడ్డు దాటుతుండగా.. మేడ్చల్‌ వైపు నుంచి సుచిత్ర వైపు జాతీయ రహదారి-44పై వెళ్తున్న ఓ బైక్‌(AP 29 CA 6628) రోడ్డు దాటుతున్న పాపయ్యను ఢీ కొట్టింది. ఇది గమనించి ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పాపయ్యను వెంటనే దగ్గరలోని బాలాజీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చయ్యింది. అయినా అతడి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. బోయిన్‌పల్లిలోని  రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సాయంత్ర 4గంటలకు పాపయ్య తుది శ్వాస విడిచాడు. రాఘవేంద్ర ఆస్పత్రిలో మరో 40 వేల రూపాయలు ఖర్చయ్యాయి. దాచుకున్న డబ్బు అయిపోవడంతో.. అప్పు తెచ్చి మరి చికిత్స చేయించారు. కానీ పాపయ్యను బతికించుకోలేకపోయారు.

5 నిమిషాలు.. లక్ష రూపాయల అప్పు
ఉదయం వరకు సంతోషంగా ఉన్న పాపయ్య కుటుంబానికి సాయంత్రం అయ్యే సరికి పుట్టెడు దుఖం. రూ. లక్ష అప్పు మిగిలింది. అన్నింటి కంటే విషాదం ఏంటంటే ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించి.. వారు సంతోషంగా ఉంటే చూడాలనుకున్న ఆ తండ్రి వాటిని చూడకుండానే మరణించాడు. 20 ఏళ్ల క్రితం పాపయ్య ప్రారంభించిన ప్రయణాన్ని ఇప్పుడు ఆయన కొడుకు మళ్లీ తిరిగి ప్రారంభించాలి. ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఓ రోడ్డు ప్రమాదం.. కేవలం 5 నిమిషాల్లో మింగేసింది.

కాబట్టి రోడ్డు దాటుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.. భారీ వాహనాల సమీపంలో రోడ్డు దాటకండి అని సైబరాబాద్‌ పోలీసులు ప్రజలను కోరుతున్నారు. కాలి నడకన వెళ్లేవారు బాట లేని చోట ఫెన్సింగ్‌, ఇనుప కడ్డీలు తొలిగించి రోడ్డు దాటకూడదని.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండమని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు