కేసు ఎలా విచారణ చేద్దాం

4 Dec, 2019 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ అంటూ ప్రజాందోళనలు తారస్థాయికి చేరడంతో ఈ కేసులో నిందితులను ఎలా విచారిద్దామన్న మీమాంసలో సైబరాబాద్‌ పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆ నిందితులను మాకు వది లేయండి, చంపేస్తామంటూ ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో వారి భద్రత ఎలా అన్న దానిపై పోలీసులు ఎటూపాలుపోని స్థితిలో ఉన్నారు.  నిన్నటి వరకు నిందితుల విచారణ సాఫీగా జరుగుతుందనుకోగా, ఇప్పుడు ప్రజాందోళనలతో వారిని సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌కు తీసుకువెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అందుకే నిందితుల కస్టడీ అంశాన్ని బయటకు పొక్కనీయడం లేదు.  నిందితుల విచారణ క్రమంలో దిశ సామూహిక అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు, పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. కేసులో దోషులకు ఉరిశిక్ష పడేలా చేయాలన్న ఉద్దేశంతో ఉన్న పోలీసులు నిందితుల విచారణ అంశాల్నీ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. తరచూ కోర్టులు, ఇతర ప్రదేశాలకు నిందితులను తీసుకెళ్లేందుకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 

చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్‌..
దిశ కేసులో నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్, శివ, నవీన్‌ కుమార్, చెన్నకేశవులు చర్లపల్లి జైలులో ఉండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని, మరోవైపు ప్రజలు ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా నిందితులను బుధవారం తెల్లవారుజామున, లేదంటే అదే రోజు రాత్రిలోపు పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశముందని తెలిసింది. మరోవైపు నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడంతో.. కస్టడీకి తీసుకుంటున్నామంటూ మంగళవారం వారికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.  

>
మరిన్ని వార్తలు