అరచేతిలో 'షీ సేఫ్‌'!

27 Feb, 2020 02:00 IST|Sakshi

సైబరాబాద్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సంయుక్తంగా యాప్‌ రూపకల్పన

గృహ హింస, సైబర్‌ నేరాల్లో మార్గదర్శక్‌ల ద్వారా మహిళలకు సహాయం

ఐటీ కారిడార్‌లో సురక్షిత హాస్టళ్లు ఎంచుకునేలా వివరాలు

వీధి దీపాలు లేని ప్రాంతాల ఫొటోలు అప్‌లోడ్‌ చేసేలా ఫీచర్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘మీరు గృహ హింసకు గురవుతున్నారా.. ఆన్‌లైన్‌ వేదికగా ఆకతాయిలు వేధిస్తున్నారా.. సైబర్‌ నేరాల బారిన పడ్డారా.. జీవితంపై విరక్తి చెంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..’కారణాలేమైతేనేం మీ మొబైల్‌లో ‘షీ సేఫ్‌’యాప్‌ నిక్షిప్తం చేసుకుంటే చాలు. నేరాలు, ఒత్తిడి తదితరాల బారి నుంచి ఎలా బయటపడాలో మార్గదర్శక్‌లు దగ్గరుండి మరీ మీకు మార్గదర్శనం చేసి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. అది పోలీసుపరంగా, న్యాయపరంగా, షీ టీమ్‌ల పరంగా.. ఇలా ఎవరి వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందో అటువైపుగా మార్గదర్శనం చేసి ఆ బాధల నుంచి విముక్తి కల్పిస్తారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సరికొత్తగా రూపొందించిన ‘షీ సేఫ్‌’యాప్‌ అతివలకు ఎంతో ఉపయుక్తకరం కానుంది. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్న ఈ యాప్‌ను వచ్చే మహిళా దినోత్సవం పురస్కరించుకొని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అధికారికంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ముఖ్య వివరాలను జోడించి ఈ యాప్‌ను సరికొత్తగా అతివల భద్రత కోసం తీసుకొచ్చే అవకాశాలున్నాయి.  

మార్గదర్శనం చేస్తారు
ఈ యాప్‌ను నిక్షిప్తం చేసుకున్న మహిళలు ఎవరైనా గృహహింస, ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ నేరాల విషయాల్లో మార్గదర్శక్‌ల సహాయం కోరవచ్చు. మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా మార్గదర్శక్‌లు, షీ బృందాలు, మహిళా పోలీసు స్టేషన్లు, భరోసా కేంద్రాలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతుంది. హాక్‌ ఐను కూడా దీంతో అనుసంధానం చేశారు. అలాగే మహిళల భద్రత గురించి ఎస్‌సీఎస్‌సీ నిర్వహించే భద్రత కార్యక్రమాలు, అవగాహన సదస్సు వివరాలను తెలుసుకోవచ్చు.  

‘సేఫ్‌ స్టే’చేయవచ్చు.. 
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో 2 లక్షల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏ హాస్టల్స్‌ ఉండేందుకు సురక్షితమనే వివరాలను కూడా ‘ప్రాజెక్టు సేఫ్‌ స్టే’ఫీచర్‌లో పొందుపరిచారు. ఇప్పటికే ఏఏ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలున్నాయి, భద్రత ఎలా ఉంది, సందర్శకుల రిజిస్టర్‌ నమోదు చేస్తున్నారా తదితర అంశాలపై అధ్యయనం చేసిన ఎస్‌సీఎస్‌సీ, సైబరాబాద్‌ పోలీసులు వందకుపైగా హాస్టళ్ల పేర్లను చేర్చారు. ఇలా ఐటీ కారిడార్‌లో ఏఏ హాస్టళ్లలో ఉండటం మంచిదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.  

ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయండి.. 
మీరు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకుండా చీకటిగా ఉంటే ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. ఇలా మీరు ఆ చిత్రాన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తే ఎస్‌సీఎస్‌సీ సభ్యులు సంబంధిత విభాగాల ద్వారా ఆయా ప్రాంతాల్లో లైట్లు వెలిగేలా చూస్తారు. అలాగే ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ–లెర్నింగ్స్, భద్రత అవగాహన మాడ్యూల్స్‌ను యాక్సెస్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్‌ మహిళా ఉద్యోగుల కోసం నడుపుతున్న షీ షటిల్‌ బస్సుల ప్రయాణ వివరాలు అందుబాటులో ఉంచారు. అలాగే హాక్‌ ఐ యాప్‌ కూడా ఈ అప్లికేషన్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకునేలా రూపకల్పన చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌కి కూడా యాక్సెస్‌ చేశారు.  

హాక్‌ ఐ అత్యవసర పరిస్థితుల్లో.. 
హాక్‌ ఐ అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడానికి మరియు ఏదైనా సంఘటనలను నివేదించడానికి సంబంధించిన యాప్‌. అయితే షీ సేఫ్‌ యాప్‌ ముఖ్యంగా మహిళలు బాధలో ఉన్నప్పుడు మార్గదర్శక్‌లను సంప్రదించవచ్చు. తద్వారా సాయం పొందొచ్చు. మహిళలను అప్రమత్తంగా ఉంచటానికి ఇందులో రోజువారీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. నిరంతరం మహిళల భద్రత గురించి వివరాలుంటాయి. ఈ యాప్‌ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.  

డౌన్‌లోడ్‌ చేసుకోండిలా...
గూగుల్‌ ప్లే స్టోర్‌కు వెళ్లి ‘షీ సేఫ్‌’అని టైప్‌ చేయగానే యాప్‌ వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాపిల్‌ స్టోర్‌ ద్వారా కూడా నిక్షిప్తం చేసుకునేలా ఫీచర్లు రూపొందించారు. 

మరిన్ని వార్తలు