బీజేపీ నేతలతో డీఎస్‌ తనయుడి మంతనాలు

10 Sep, 2017 03:47 IST|Sakshi
బీజేపీ నేతలను కలిసిన డీఎస్‌ తనయుడు

న్యూఢిల్లీ : టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ రెండో కుమారుడు  ధర్మపురి అరవింద్‌ శనివారం బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, రాంలాల్‌తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. కాగా అరవింద్‌ బీజేపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్‌  ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలను అరవింద్‌ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా ఇప్పటికే డీఎస్‌ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు డీఎస్‌ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని ఖండించారు. తాను టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అరవింద్‌ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేదని డీఎస్‌ అన్నారు.

మరిన్ని వార్తలు