ప్రజలకు ఎందుకు దూరమయ్యాం

28 Apr, 2015 03:57 IST|Sakshi
ప్రజలకు ఎందుకు దూరమయ్యాం

కాంగ్రెస్ బలోపేతంపై డీఎస్ కమిటీ సమాలోచనలు
సంప్రదాయ ఓటు బ్యాంకుకు
గండిపడిందని అభిప్రాయం

 
హైదరాబాద్: కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువత, రైతులు, మహిళలు దూరమవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని టీపీసీసీ హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీ పోటీ చేయడం వల్ల కూడా కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని భావిస్తోంది. కన్వీనర్ డి.శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీ సభ్యులు సోమవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందు వల్ల సెటిలర్లు పార్టీని దెబ్బతీశారని, ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని, మైనారిటీలు కూడా పార్టీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో ఓటమిని చవిచూడాల్సి  వచ్చిందని ఈ సందర్భంగా కమిటీ అంచనాకు వచ్చింది. అనంతరం డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల రెండో వారంకల్లా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగియగానే జిల్లా పర్యటనలను ప్రారంభిస్తామని, పార్టీ నాయకత్వానికి వంద రోజుల్లో నివేదికను అందజేస్తామని తెలిపారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వారానికి రెండు జిల్లాల చొప్పున పర్యటనలు చేపడతామన్నారు.
 
సమస్యలు పట్టని సీఎం: ఉత్తమ్
సీఎం కేసీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదని, ఆయన ధ్యాసంతా పార్టీ ఫిరాయింపులపైనేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చెత్తపోయిందని, నిఖార్సైన కార్యకర్తలు మిగిలారన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే నాయకత్వం అండగా ఉంటుందని, ఇందుకోసం గాంధీభవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ సభ్యత్వాన్ని సత్వరమే పూర్తిచేసి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా నేతల సమావేశంలో మాజీమంత్రి మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లు ముఖ్యనేతల మధ్యే పరోక్షంగా పరస్పర విమర్శలు చేసుకోవడం జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలను బట్టబయలు చేసింది.

మరిన్ని వార్తలు