కాంగ్రెస్ నాకేమిచ్చింది?: డీఎస్

29 Aug, 2015 02:23 IST|Sakshi
కాంగ్రెస్ నాకేమిచ్చింది?: డీఎస్

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన డి.శ్రీనివాస్
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని పొగడ్త
 

హైదరాబాద్: ‘ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి తీసుకొస్తే నాకేమిచ్చింది? ’ అని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రశ్నిం చారు. ‘‘45 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నా. ఆ పార్టీకి చాలా సేవ చేశాను. రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాను. కానీ నాకు ఆ పార్టీ ఇచ్చిందేంటి? కాంగ్రెస్‌లో పదవులు పొంది ఎకరాల కొద్ది ఆస్తులేమైనా సంపాదించానా? నేను కనుక నోరు తెరిస్తే చాలామంది ఇబ్బం దుల్లో పడతారు జాగ్రత్త. కొన్ని విషయాలలో నేనే నష్టపోయాను. అనవసర వివాదాలకు పోకూడదని నిర్ణయించుకున్నా’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో ఉద యం 11.45 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనకున్న అనుభవాన్ని ఉపయోగించి అంతర్రాష్ట్ర వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యే విధంగా కృషిచేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇరిగేషన్‌తో పాటు హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారానికి దోహదపడతానన్నారు. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి, మరో 2 టర్మ్‌లు అధికారంలోకి వచ్చేలా తన వంతు సహాయం అందిస్తానన్నారు.

అంతా బీటీ బ్యాచే..: తెలంగాణ రాష్ట్రం కోసం కృషిచేసిన వారంతా... ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో ఉండి పోరాడిన వారు బంగారు తెలంగాణ బ్యాచ్(బీటీ బ్యాచ్)కు చెందిన వారే అని డీఎస్ అన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్న బీటీ బ్యాచ్‌తో మొదటి నుంచి ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనే వాదనలపై మీడియా ప్రశ్నకు డీఎస్ బదులిస్తూ.... తలరాతను బట్టి ఎట్ల రాసిపెట్టి ఉంటే అట్లే జరుగుతాదని చెప్పారు. తనకు టాలెంట్ ఉండటం వల్లే కేసీఆర్ పదవి అప్పగించారన్నారు.
 

మరిన్ని వార్తలు