నిబంధనలు గాలికి!

30 Jan, 2015 03:24 IST|Sakshi
నిబంధనలు గాలికి!

సిద్దిపేట రూరల్ : జిల్లాలోనే అన్ని రంగాల్లో సిద్దిపేట ముం దుకెళుతోంది. గత కొన్నేళ్లుగా రాజీవ్ రహదారిపై పట్టణ శివారులో ఉన్న దాబా హోటళ్లు మద్యం సిట్టింగ్ కేంద్రాలుగా ఉండేవి. జిల్లా ఎస్పీ సుమతి రాకతో సిద్దిపేట డివిజన్ వ్యాప్తం గా దాబాలు గత వారం రోజులుగా వెలవెలబోతున్నాయి. దాబాల్లో మద్యం సిట్టింగ్ లేకపోవడంతో మద్యం బాబులు పర్మిట్ రూంలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పర్మిట్ రూంల నిర్వాహకులు ఇష్ఠారీతిలో డబ్బులను దండుకుంటున్నారు.

సిద్దిపేట కేంద్రంగా కరీంనగర్, హైదరాబాద్‌ల వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు ఇక్కడ నిలుపుతుంటారు. దాబా హోటళ్లలో భోజనంతో పాటు రహస్యంగా మద్యం అంది స్తున్నారు. ఇటీవల సుమతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడంతో ముందు జాగ్రత్తగా స్థానిక పోలీసులు దాబాల్లో మద్యం సిట్టింగ్‌లను నిలిపివేయించారు. దీంతో మద్యం బాబులంతా వైన్స్‌ల పక్కనే ఉండే పర్మిట్ రూంలలోకి వెళ్తున్నారు.

పర్మిట్ రూంను నిబంధనల మేరకు నడిపించాల్సి ఉన్నప్పటికి మద్యం బాబులు ఎక్కువగా రావడంతో నిర్వాహకులకు కిక్కు ఉండడంతో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఇష్టారీతిగా పర్మిట్ రూంను పెంచేసుకుంటూ మందుబాబులకు కావాల్సిన తిండిని సమకూరుస్తూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి.

నిబంధనలు పాటించని పర్మిట్ రూంల్లో అధికారులు ఎలాంటి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దాబాలను కట్టడి చేసిన మాదిరిగానే పర్మిట్ రూంల్లో నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ఇప్పటికైనా  ఎస్పీ స్పందించి పర్మిట్ రూంలను నిబంధనల మేరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు