కూలీ కొడుకు.. కేవీ డైరెక్టర్‌

4 Aug, 2019 22:10 IST|Sakshi

వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. పనికోసం మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రుల బాధలను కళ్లారాచూసిన కొడుకు... కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అటువంటి ఓ ఆదర్శవంతమైన ఓ వ్యక్తి గురించి ఇవాళ తెలుసుకుందాం.

భైంసా టౌన్‌ : సిరిమల సాంబన్నది మహారాష్ట్రలోని బుర్బుశి గ్రామం. తల్లి లక్ష్మీబాయి, తండ్రి దిగంబర్‌. ఇరువురూ వ్యవసాయ కూలీలే. వీరికి నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కూతుళ్లు కాగా, సిరిమల సాంబన్న ఒక్కడే కొడుకు. బతుకుదెరువు కోసం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే లక్ష్మిబాయి, దిగంబర్‌లు కుభీర్‌కు వలస వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. సాంబన్న విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. పదో తరగతి వరకు కుభీర్‌లోని జిల్లాపరిషత్‌ పాఠశాలలో చదువుకున్న సాంబన్న భైంసా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశారు. అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేశారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా, 1987లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొలువు సాధించారు.

కుభీర్‌ మండలంలో మొట్టమొదటి పోస్టింగ్‌ వచ్చింది. అయితే ఎప్పటికైనా ఇంకా ఉన్నత కొలువు సాధించాలని భావించిన సాంబన్న కొద్దిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1988లో కేంద్రీయ విద్యాలయంలో టీజీటీగా ఎంపికయ్యారు. ఏడాదిపాటు రామగుండంలో విధులు నిర్వర్తించారు. మళ్లీ 1989లో నవోదయ విద్యాలయంలో పీజీటీగా ఉద్యోగం వచ్చింది. నిజాంసాగర్‌లోని నవోదయ విద్యాలయంలో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత 1994లో ఒడిశాలోని భువనేశ్వర్‌కు పదోన్నతిపై వెళ్లారు. 2003లో పంజాబ్‌లో భటిండాలో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు.  ప్రస్తుతం గ్వాలియర్‌లోని జోనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు