ఇక డెయిరీపై సర్కారు దృష్టి!

30 Jun, 2015 05:04 IST|Sakshi
ఇక డెయిరీపై సర్కారు దృష్టి!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెయిరీ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. సహకార రంగంలో పాల ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పాల అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ)తో చర్చలు జరిపింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌డీడీబీ ప్రతినిధులు సయీద్, లతతో కూడిన బృందంతో సోమవారం పశు సంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌పీ సింగ్ చర్చలు జరిపారు. డెయిరీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సహకార డెయిరీని అభివృద్ధి చేయాల్సిన అవసరంపై చర్చించారు. రెండు నెలల్లోగా ‘తెలంగాణ డెయిరీ పాలసీ’ తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
 
అవకాశాలపై అధ్యయనం...
వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా గ్రామాల్లో పాడిరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్కారు ఈ రంగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా విజయ డెయిరీకి పాలు పంపిణీ చేసే రైతులకు సేకరణ ధరను లీటరుకు అదనంగా రూ.4 పెంచింది. విజయ పాలు రోజుకు 5.26 లక్షల లీటర్లు విక్రయిస్తున్నా ప్రైవేటు వాటా 75 శాతంగా ఉంది. దీంతో ప్రైవేటు రంగం నుంచి పోటీ తట్టుకుని విజయ డెయిరీని గట్టెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సర్కారు నిర్ణయించింది. అలాగే లాలాపేటలోని విజయ డెయిరీ పాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఆధునీకరించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం అక్కడ రోజుకు 5 లక్షల లీటర్ల వరకు పాల ప్రక్రియ చేపట్టే సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 10 లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో పాడి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎన్‌డీడీబీని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్‌డీడీబీ బృందం 45 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత డెయిరీ పాలసీలో ఉండాల్సిన అంశాల ముసాయిదాను ఎన్‌డీడీబీ ఇవ్వనుంది.

అయితే గుజరాత్ నుంచి వస్తున్న అమూల్, కర్ణాటకకు చెందిన నందిని పాల విక్రయాలను నిరోధించాల్సిన అవసరం లేదని దేశమంతా ఎక్కడైనా పాలు విక్ర యించుకునే స్వేచ్ఛ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, నెయ్యి, వెన్న, పన్నీరు, పాల పొడి తదితర పాల పదార్థాలపై 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సహకార, ప్రైవేటు డెయిరీలు ప్రభుత్వానికి కూడా విన్నవించాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా