ఐధైర్య పడొద్దు...అండగా ఉంటాం

25 Jul, 2015 00:34 IST|Sakshi
ఐధైర్య పడొద్దు...అండగా ఉంటాం

పాతపల్లి దళితులకు ప్రొఫెసర్ హరగోపాల్ అభయం
పాతపల్లి(పెబ్బేరు):
పాతపల్లి దళితులు అధైర్యపడొద్దని, వారికి అండగా ఉంటామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మండల పరిధిలోని పాతపల్లి గ్రామాన్ని శుక్రవారం ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ, జిల్లా కార్యదర్శి రవికుమార్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారీలు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక దళితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు. గ్రామంలోని ఆలయంలో దళితులు ప్రవేశం చేయడంతో కుల వివక్ష ప్రారంభమైందన్నారు.

బోయకులస్తులకు  వనపర్తి ఆర్డీఓ, డీఎస్పీలు అండగా ఉండి దళితుల పట్టా భూముల్లో గుడిసెలను తొలగించి మృతదేహాలను ఖననం చేయించారని వారు చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు ఇతర నాయకులు వివాదాస్పదంగా మారిన భూములను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
 
సమగ్ర న్యాయవిచారణ చేయాలి

ఘటనపై ప్రభుత్వం  సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారీలు డిమాండ్ చేశారు.పెబ్బేరులో వారు విలేకరులతో మాట్లాడారు. పాతపల్లిలో వాల్మీకి యువజన సంఘం తమకు  వినతి పత్రం ఇచ్చారని, గ్రామంలో కులవివక్ష లేదని అందులో పేర్కొన్నారన్నారు. దళితుల గుడిసెలు తొలగించలేదని, సాంఘిక బహిష్కరణ చేయలేదని పేర్కొన్నారన్నారు. ఈ విషయాన్ని దళితులు ధృవీకరించాలన్నారు. వివక్ష లేకపోతే బోయకులస్తులే దళితులను ఆలయ ప్రవేశం చేయించాలన్నారు. వారి భూముల్లో ఖననం చేసిన మృతదేహాలను వెలికి తీయాలన్నారు. దళితులపై దాడి చేసిన బోయ కులస్తులతో పాటు, పూజారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. టీవీవీ జిల్లా కార్యదర్శి వై.బాల్‌రాం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యోసేపు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు