కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య

30 Aug, 2018 05:16 IST|Sakshi
బుధవారం అంబుజాక్షన్‌కు చెక్కును అందజేస్తున్న చుక్కా రామయ్య. చిత్రంలో కాకి మాధవరావు, మల్లేపల్లి లక్ష్మయ్య

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్‌కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ కన్వీ నర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్‌ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు