దమ్మపేట పోలీసులు.. ప్రకృతి ప్రేమికులు..!

30 Mar, 2019 14:08 IST|Sakshi
దమ్మపేట పోలీస్‌ స్టేషన్‌కు అందాన్ని తీసుకొచ్చిన మొక్కలు, స్టేషన్‌ ఆవరణలో కొబ్బరి, గానుగ మొక్కలు 

సాక్షి, దమ్మపేట: మనుషుల రక్షణే కాకుండా ప్రకృతి రక్షణకు ఇక్కడి పోలీసులు నడుం బిగించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతున్నారు. నిత్యం చెట్ల రక్షణ కోసం సమయాన్ని కేటాయిస్తూ దమ్మపేట పోలీస్‌స్టేషన్‌ను పచ్చదనంతో నింపారు. దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి పక్కనే పోలీస్‌స్టేషన్‌ పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటున్నది. హరితహారంలో భాగంగా అప్పటి ఎస్‌ఐ ఎం.నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా మొక్కలు నాటుతూ వాటి పరిరక్షణ చేపట్టారు. ఇక్కడి మొక్కలపై ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మొక్కలను పోలీసులు దత్తత తీసుకున్నారు. ఇక్కడ గానుగ, దానిమ్మ, వేప, కొబ్బరి మొక్కలను నాటారు. క్రోటన్‌తో పాటు ప్రత్యేక పూల మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేసి స్టేషన్‌ ముందు అందమైన గార్డెన్‌ రూపొందించారు. ఎదిగిన ప్రతి చెట్టుకు ట్రీ గార్డ్‌ ఏర్పాటు చేశారు.

పచ్చదనంతో ప్రశాంత వాతావరణం
పచ్చదనంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని అంటున్నారు ఎస్సై జలకం ప్రవీణ్‌. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘చెట్ల నీడన చేరితే మన అలసట తీరుతుంది. పచ్చని చెట్లు ఆహ్లాదాన్నిస్తాయి. ఆలోచనలపై సానుకూల ప్రభావం చూపుతాయి. బాధ, కోపం, ఆవేశంతో ఎన్నో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో మంచి ఆలోచనలు, మనుషుల్లో మార్పు రావడానికి ఇక్కడి పచ్చదనం కొంత దోహదపడుతోంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు