జీవితం ఓ ఛాలెంజ్..!

19 Jan, 2019 10:28 IST|Sakshi

ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్‌

55 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శనలు

ఇప్పటి వరకు వెయ్యికి పైగా ప్రోగ్రామ్‌లు  

హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం

నేడు శిల్ప కళావేదికలో నృత్య ప్రదర్శన

బంజారాహిల్స్‌: ఆమె జీవితం తెరిచిన పుస్తకం. కాలం కక్షగట్టినా.. పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎదురు నిలిచారేగానీ వెనక్కి తగ్గలేదు. నాట్యకారిణిగా ఎదగాలని కలలుగన్న ఆమెను విధి వంచించినా వెరవలేదు. అందుకే ఆమె జీవితం భావితరాలకు పుస్తక పాఠంగా మారింది. ‘సుధాచంద్రన్‌’.. నాట్యమయూరిగా కీర్తి గడించిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి. జీవితాన్ని చాలెంజ్‌ చేసి తనను తాను మలచుకున్నారు. కాలానికి ఎదురీది సినీ, టీవీరంగాలో ఎదిగారు. అంగవైకల్యం గల వారికి జైపూర్‌ కృత్రిమ కాళ్లు ఉచితంగా అందజేసేందుకు నిధుల సేకరణ కోసం భగవాన్‌ మహావీర్‌ వికలాంగుల సహాయ సమితి నగరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. శనివారం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో జరిగే వేడుకలో సుధాచంద్రన్‌ నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన మనసులోని మాటను పంచుకున్నారు. ఆ వివరాలు సుధా మాటల్లోనే..  

నా జీవితంలో అతి ముఖ్యమైన ప్రతి సంఘటనా అందరికీ తెలిసిందే. ఒక కాలు పోగొట్టుకొని ఇక జీవితంలో ఏమీ సాధించలేనేమోనని కుంగిపోతున్న తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించింది. ‘మయూరి’ సినిమా ద్వారా కొత్త జీవితాన్నిచ్చింది. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ సినిమా షూటింగ్‌ ద్వారా నగరంతో మంచి అనుబంధం ఏర్పడింది. 1965 సెప్టెంబర్‌ 27న సుధాచంద్రన్‌ ఈ భూమ్మీదకు వచ్చింది. భరతనాట్యం అంటే పిచ్చిప్రేమ అనుకోకుండా 1981లో తిరుచరాపల్లి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్నారు. జీవితంలో ఇంకేం సాధించలేననుకున్నాను. అంతా శూన్యంమైపోయిందనుకున్నారు. అప్పుడే అప్పుడే జైపూర్‌ కృత్రిమ కాలును అమర్చుకున్నాను. ఆత్మవిశ్వాసంతో తిరిగి ప్రదర్శనలు ఇవ్వసాగాను. అలాంటి సమయంలో నా జీవితాన్నే ‘మయూరి’ సినిమాగా తీశారు. 1985లో విడుదలైన ఈ సినిమా ఇటు తెలుగులోను, అటు హిందీలోను హిట్‌ అయింది. 1986లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు, స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాను. తర్వాత పది తమిళ సినిమాల్లో, ఐదు మళయాళ సినిమాల్లో, పది హిందీ సినిమాల్లో నటించాను. భరతనాట్యం నృత్యకారిణిగా ఇప్పటి దాకా మన దేశంతో పాటు అమెరికా, లండన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, తదితర 30 దేశాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పటికీ ఇస్తునే ఉన్నాను. హైదరాబాద్‌లోనూ 25కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా చార్మినార్‌ చూస్తాను. చూడిబజార్‌లో గాజులు కొనుక్కుంటాను.  

ప్రతి ప్రదర్శనా ఓ సందేశం
నా నృత్య ప్రదర్శనల్లో ఓ సందేశం ఉంటుంది. జైపూర్‌ ఫుట్‌ నేపథ్యంగా శిల్పకళావేదికలో ఈ ప్రదర్శన ఇవ్వనున్నాను. ఇందులో కొంత మంది చాలెంజ్‌డ్‌ పర్సన్స్‌ కూడా ఉన్నారు. ‘బాహుబలి’ కాన్సెప్ట్‌ను ఇందులో ప్రదర్శిస్తున్నాం. ప్రభాస్‌ శివలింగాన్ని ఎత్తినట్లు ఈ ప్రదర్శనలో నేను జైపూర్‌ కృత్రిమ కాళ్లు చూపించి ఎవరూ ఆత్మన్యూనతకు గురి కావద్దని చెప్పబోతున్నాను. గతంలో కూడా ముంబై పేలుళ్ల నేపథ్యంలో కాళ్లు, చేతులు కోల్పోయినన వారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ప్రదర్శనలు ఇచ్చాను. ప్రతి ప్రదర్శనలోనూ ఒక కాన్సెప్ట్‌ను తీసుకుంటున్నాను. ఇందులో ఎక్కువగా అంగవైకల్యం గల వారికి ఉచితంగా సేవలను అందించే సంస్థలు వారికి నిధుల సేకరణ ఉంటాయి.  

కళాకారులు సాధించిన విజయాల పట్ల సంతృప్తి ఉండదు. అలా ముందుకు సాగిపోయినవారే నిజమైన కళాకారులు. కళాకారులకు సృజనాత్మక శక్తి ఉంటుంది. దాంతో ఎప్పుడూ ఎంతోకొంత అసంతృప్తి అలానే ఉండిపోతుంది. దానికి అంతం ఉండదు. అందుకున్న విజయాలతో సంతృప్తి పడడం మంచిది కాదు. సంతృప్తి పడిపోతే అది అభివృద్ధికి చరమగీతం పాడుతుంది. కాలానికి అనుగుణంగా నడవాలి. భావాలను మార్చుకుంటూ ప్రేక్షకుల న్యాయమైన కోర్కెలను మాత్రం తీరుస్తూ ముందుకు సాగిపోవాలి. నటులైనా, రచయితలైనా, శిల్పి అయినా, లలిత కళలకు సంబంధించిన ఎవరైనా సరే అలాగే ఉండాలి.  –సుధా చంద్రన్‌

నేడు సుధాచంద్రన్‌ నృత్య ప్రదర్శన  
పంజగుట్ట: దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటుకు విరాళాలు సేకరణ కోసం, దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపడం కోసం రాజస్థాన్‌కు చెందిన సేవా సంస్థ ‘భగవాన్‌ మహావీర్‌ వికలాంగ్‌ సాహిత్య సమితి’(బీఎంవీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో నేడు జైపూర్‌ ఫుట్‌ ప్రచారకర్త మయూరి సుధాచంద్రన్‌ నృత్యప్రదర్శన ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో జరిగే ప్రదర్శనకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీఎంవీఎస్‌ఎస్‌ ప్యాట్రన్‌ పి.సి. పారక్, అధ్యక్షుడు లక్ష్మీనివాస్‌ శర్మ, ఉపాధ్యక్షులు ఉషా పారక్, సంజయ్, వికలాంగుల సంఘం ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు కరపత్రాన్ని ఆవిష్కరించారు.  

మరిన్ని వార్తలు