దండేపల్లి ఘనత రాజకీయ చరిత

10 Nov, 2018 10:19 IST|Sakshi
జేవీ నర్సింగరావు, జీవీ సుధాకర్‌రావు, చుంచు లక్ష్మయ్య, గోవిందనాయక్‌

నలుగురు నాయకులు తొమ్మిది సార్లు అసెంబ్లీకి..

ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పదవులు

దండేపల్లి(మంచిర్యాల): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో దండేపల్లి మండలం రాజకీయ ఘనత వహించింది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు లక్సెట్టిపేట నియోజకవర్గంగా ఉండేది. ఇందులో దండేపల్లిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మండలానికి చెందిన నలుగురు నాయకులు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నత పదవులు అధిరోహించారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ పదవులు పొందారు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన జేవీ నర్సింగరావు, కొర్విచెల్మకు చెందిన జీవీ సుధాకర్‌రావు, కన్నెపల్లికి చెందిన చుంచు లక్ష్మయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

లింగాపూర్‌కు చెందిన అజ్మేర గోవింద్‌నాయక్‌ కూడా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వారిలో జేవీ నర్సింగరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జీవీ సుధాకర్‌రావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పలు ఉన్నత పదవులు చేపట్టారు. చుంచు లక్ష్మయ్య ఒకసారి, గోవిందనాయక్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

విద్యుత్‌ ఆరాధ్యుడు జేవీ..

దండేపల్లి మండలం ధర్మరావుపేటకు చెందిన జేవీ నర్సింగరావు 1967–72 కాలంలో రాష్టానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూ 1957లో అక్కడి బేగంబజార్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలుపొందారు. నీలం సంజీవరెడ్డి కేబినెట్‌లో నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గం అయిన లక్సెట్టిపేటకు వచ్చారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ సమయంలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1972లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కాకుండా పలు కీలక పదవులు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా, విద్యుత్‌ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. విద్యుచ్ఛక్తి బోర్డు చైర్మన్‌గా పనిచేసిన కాలంలో జిల్లాలో విద్యుత్‌ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశాడు. కడెం ప్రాజెక్టు నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. 1972, సెప్టెంబర్‌ 4న తుదిశ్వాస విడిచారు. 

ముక్కుసూటి మనిషి జీవీ..

మండలంలోని కొర్విచెల్మ (రాజంపేట)గ్రామానికి చెందిన మాజీ మంత్రి జీవీ సుధాకర్‌రావు ముక్కు సూటి మనిషి. పట్టుదలకు మారు పేరున్న వ్యక్తిగా పేరు గడించారు. అంతే కాకుండా సరస్వతి కాల్వ నిర్మాతగా కూడా పేరుంది. ఒకసారి ఎంఎల్‌సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌ శాఖల అధ్యక్షుడిగా పనిచేస్తూ జీవి 1977లో మొదటి సారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు.

మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేసి సరస్వతి కాలువ నిర్మాణానికి అంకుర్పాణ చేశారు. 1983లో ఓడిపోయి 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో మళ్లీ ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి మంత్రి వర్గంలో రోడ్డు రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2002 డిసెంబరు 30న హైదరాబాద్‌లో మరణించారు.

మూడో వ్యక్తి లక్ష్మయ్య..

దండేపల్లి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మూడో వ్యక్తి చుంచు లక్ష్మయ్య. కన్నెపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1967 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి గెలిచారు. పదవి కాలం అనంతరం లక్సెట్టిపే ట కోర్టులో, హైదరాబాద్‌ హైకోర్టులోనూ ప్రాక్టీసు చేశారు. 2007లో హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం అయిన కన్నెపల్లికి వచ్చారు. గ్రామ సమీపంలోని సదానందహరి ఆలయంలో కొద్దిరోజుల పాటు ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ అనారోగ్యానికి గురై 2008 మే 1న మృతి చెందాడు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, తర్వాత లక్సెట్టిపేట, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా లక్ష్మయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు.

నాలుగో వ్యక్తిగా గోవిందనాయక్‌.. 

దండేపల్లి మండలం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాలుగో వ్యక్తి గోవిందనాయక్‌. ఈయనది మండలంలోని లింగాపూర్‌. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖానాపూర్‌ నియోజక వర్గం నుంచి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలిచి గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి, 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మరిన్ని వార్తలు