విజృంభిస్తున్న ‘గ్లకోమా’

11 Mar, 2019 06:31 IST|Sakshi

పెరుగుతున్న కంటి వ్యాధి బాధితులు  

లక్షణాల్లేకుండానే తీవ్రమయ్యే సమస్య  

నగరంలో 2.4 లక్షల కేసులు

సాక్షి, సిటీబ్యూరో: అనారోగ్య సమస్యల్లో రెండు రకాలుంటాయి. ముందుగా లక్షణాలను ప్రస్ఫుటింపజేసి చికిత్స ఇచ్చేందుకు అనువైనవి కొన్నయితే... లక్షణాలు లేకుండా శరీరంలో తిష్టవేసి పెద్ద సమస్యగా మారి పెను ప్రమాదాల ను సృష్టించేవి కొన్ని. వైద్య రంగానికి తరచూ సవాలు విసిరేవి రెండో రకమే. అటువంటిదే కంటి వ్యాధి గ్లకోమా అని నిర్వచిస్తున్నారు నగరానికి చెందిన అగర్వాల్‌ కంటి ఆసుపత్రి రీజనల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరుగంటి వంశీధర్‌. గ్లకోమా వీక్‌ (మార్చి 10–16) సందర్భంగా ఈ వ్యాధి గురించి ఆయన చెప్పిన విషయాలివీ... 

అంధత్వ కారకం..  
అంతర్జాతీయంగా అంధత్వ కారకాల్లో రెండోది గ్లకోమా. మన దేశంలో అంధత్వం బారిన పడుతు న్న వారిలో అత్యధిక శాతం దీనివల్లే. దాదాపుగా 12 మిలియన్ల మంది దీని బారిన పడతుంటే వీరి లో 1.2 మిలియన్ల మంది అంధులుగా మారుతున్నారు. అంతర్జాతీయంగా 60 మిలియన్ల కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 80 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా దీనివల్ల అంధులవుతున్న వారి సంఖ్య 3 మిలియన్లుగా అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 3.5శాతం మంది గ్లకోమా బారిన పడ్డారని, కేవలం హైదరాబాద్‌లోనే 2.4లక్షల కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. 

వయసుతో పాటు పెరిగే సమస్య...
దీని ప్రభావం 40 సంవత్సరాలు దాటిన వారిలో అధికం. మన దేశంలో 40ఏళ్లు దాటిన ప్రతి 20 మందిలో ఒకరు గ్లకోమా బాధితులుగానో, బాధితులు అయ్యేందుకు అవకాశాలున్న వారిగానో గుర్తించడం జరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా కంటి లోపల ఆప్లిక్‌ నరం డ్యామేజ్‌ అయి అది క్రమేపీ 60 ఏళ్ల వయసులో అంధత్వానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా దృష్టి అంచున ప్రారంభం అవుతుంది. దీని లక్షణాలు గుర్తించడం కష్టం కావడంతో దాదాపు 50శాతం మంది బాగా ముదిరాకే దీన్ని తెలుసుకోవడం జరుగుతోంది. వ్యాధి గురించి పూర్తిగా తెలిసే సరికే దృష్టికి చెందిన మధ్యస్థానాన్ని నాశనం చేస్తుంది. దీని వల్ల సంక్రమించే దృష్టి లోపం శాశ్వతంగా ఉండే అవకాశాలు ఎక్కువ.  ఈ వ్యాధిలో రెండు రకాలున్నాయి. ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా, క్లోజర్‌ గ్లకోమా. అత్యధికంగా అంటే దాదాపు 90శాతం కేసులు మొదటివే. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందు తుంది. రోగికి తన చూపు మందగిస్తోందన్న సంగతి తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. 

ముందుగా గుర్తిస్తే నివారించొచ్చు...  
తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి, వాంతులవుతున్నట్టు అనిపించడం, బాగా ప్రకాశవంతంగా ఉన్న దీపం చుట్టూ ఇంద్రధనస్సు రంగులు కనిపించడం వంటి లక్షణాలుంటాయి. దీనిని నివారించడం కష్టసాధ్యమైనప్పటికీ... తీవ్రతను తగ్గించడం సాధ్యమే. క్రమం తప్పని పరీక్షల ద్వారా గ్లకోమాను నిర్ధారించిన తర్వాత నిర్దేశించిన పరిమాణంలో కంటి చుక్కలను వాడే తక్షణ చికిత్సను ప్రారంభించాలి. దీనివల్ల కంటి లోపల ఫ్లూయిడ్స్‌ ఏర్పడడం, ఔట్‌ ఫ్లో వృద్ధి చెందడం తగ్గిస్తుంది. తాత్కాలిక, శాశ్వత దృష్టిలోపం సంభవించకుండా లేజర్‌ లేదా మైక్రో సర్జరీ అవసరం అవుతుంది. శిశువులు చిన్నారుల్లో  పుట్టిన సంవత్సరం లోపే గుర్తించడం జరుగుతుంది. శిశువు పుట్టకముదు కంటి లోపల ఫ్లూయిడ్‌ ఫ్లో వ్యవస్థ సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. తొలుత కంటి సంబంధ మందులతో ప్రారంభించి, తీవ్రవతను బట్టి లేజర్, కంటి శస్త్ర చికిత్సావకాశాలను చూస్తారు. ప్రస్తుతం గ్లకోమా చికిత్సకు ఎన్నో నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్‌ పాస్‌ ఫోర్‌ త్రో ప్యుపిల్లోప్లాస్టీ ద్వారా ఈ వ్యాధి మూలకానికి చికిత్స చేయవచ్చు. దీని నివారణలో భాగంగా 40ఏళ్లు దాటాక తప్పకుండా తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, మధుమేహం అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిఅనుసరించాలి. 

మరిన్ని వార్తలు