బ్లాస్టింగ్‌ భయం

19 Feb, 2018 15:35 IST|Sakshi

ఓపెన్‌కాస్ట్‌లో పేలుళ్ల ధాటికి పగిలిన రేకులు 

ఇంట్లోకి వచ్చి పడిన బండరాయి  ∙బాలికకు తప్పిన ప్రాణాపాయం  

ఓసీపీ–3లో కాలనీవాసుల ఆందోళన

గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా) : సింగరేణి ఆర్జీ–2 డివిజన్‌ పరిధిలోని ఓపెన్‌కాస్ట్‌–3 ప్రాజెక్టులో బొగ్గును వెలికితీసేందుకు ముందు దాని పైన ఉన్న మట్టిని తొలగించేందుకు చేసిన బ్లాస్టింగ్‌తో గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంటి రేకులు పగిలిపోయాయి. ఇదే క్రమంలో ఓసీపీ బండరాయి కూడా వచ్చి పడగా, త్రుటిలో బాలికకు ప్రాణాపాయం తప్పింది. విఠల్‌నగర్‌లో నివాసముండే కత్తెరవేన కుమార్, కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం 3.30 నుంచి 4 గంటల మధ్యలో ఓపెన్‌కాస్ట్‌–3లో పీసీ పటేల్‌ అనే ఓవర్‌బర్డెన్‌ కంపెనీ మట్టి కోసం బ్లాస్టింగ్‌ చేసింది. ఒక్కసారిగా కుదుపులతో కూడిన బ్లాస్టింగ్‌ జరగగా, ఇంటి రేకులపై బండపడడంతో అది పగిలిపోయి మంచంపై పడింది.

అదే సమయంలో కుమార్‌ కూతురు ఆరేళ్ల కార్తీక మంచంపై ముందుకు వంగి హోంవర్క్‌ చేసుకుంటున్నది. రేకు పగిలిపోయి అందులో ఉన్న వచ్చిన బండ ఆమె వీపుపై వచ్చి పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇంట్లో వారంతా హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. కాలనీవాసులు కూడా ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవేళ బండ బాలిక తలపై పడితే ఆమె ప్రాణానికే ముప్పు ఏర్పడేదని స్థానికులు పేర్కొన్నారు. ఓసీపీ–3లో బ్లాస్టింగ్‌ వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, విఠల్‌నగర్‌లో తాము బతుకుడా, లేక సచ్చుడా అని పలువురు కాలనీవాసులు సాయంత్రం ప్రాజెక్టులోపలికి వెళ్ళి రహదారిపై బైఠాయించి ఓబీ కంపెనీ వాహనాలను నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని కూర్చోవడంతో ఓబీ కంపెనీ ప్రతినిధులు బాధితుడి ఇంటికి వచ్చి పరిశీలించారు. కంపెనీ తరఫున సోమవారం కూడా వచ్చి పరిశీలిస్తామని, అవసరమైన సహకారాన్ని అందిస్తామని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.    

మరిన్ని వార్తలు