అమ్మా.. నేను దాస్యం వినయ్‌భాస్కర్‌..

9 Nov, 2014 03:50 IST|Sakshi
అమ్మా.. నేను దాస్యం వినయ్‌భాస్కర్‌..

అమ్మా.. నేను దాస్యం వినయ్‌భాస్కర్‌ని. మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను. అసెంబ్లీ సమావేశాలున్నయ్. ఆదివారాల్లో హన్మకొండకు వస్తా. ఒక రోజు ప్రత్యేకంగా ప్రోగ్రాం పెడదాం. రెవెన్యూ, మునిసిపల్, పోలీసు అధికారులను ఇక్కడికే తీసుకొచ్చి అన్ని మాట్లాడుకుందాం. ఒక నెలలో ఎంతో కొంత పురోగతి ఉండేలా చూస్తా. వాస్తవంగా ఇది చెరువు శిఖం. ఇక్కడ పట్టాలు ఇవ్వరు. అయినా సీఎం కేసీఆర్‌తో చెప్తా. హైకోర్టులో తీర్పు ఉంది. హైకోర్టులో కొట్లాడి న్యాయం చేసేలా ప్రయత్నిస్తా. ఒకరు రోడ్డు మీద, మరొకరు మోరీ మీద.. ఇలా ఇష్టం వచ్చినట్లు ఇళ్లు కట్టుకోవద్దు.. వెళ్లొస్తా..
 
వినయ్‌భాస్కర్ : మీ బస్తీ పేరేందమ్మా? ఎన్నాళ్లుగా ఉంటున్నరు? మీ సమస్యలేంటి?
భద్రమ్మ : దీన్‌దయాళ్‌నగర్. చాన్నాళ్ల్ల నుంచి ఉంటున్నం. నీళ్లు వస్తలేవ్, నల్లాలు కావాలె. రోడ్లు, మోరీలు కట్టియ్యాలె.
వినయ్‌భాస్కర్ : ఏం చేస్తవ్ తమ్ముడు?
సంపత్ : టీచర్ ట్రైనింగ్. హన్మకొండ డైట్ కాలేజీలో చేస్తున్న.
వినయ్‌భాస్కర్ : ఇక్కడ ఎన్నేండ్ల నుంచి ఉంటున్నవ్?
సంపత్ : 24 ఏండ్లు. ఇక్కన్నే పుట్టిన.
వినయ్‌భాస్కర్ : నాన్న ఏంజేస్తడు?
సంపత్ : మేస్త్రీ పని.
వినయ్‌భాస్కర్ : రూ.110 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నరా?
సంపత్ : చేసుకోలేదు.
వినయ్‌భాస్కర్ : చదువుకున్నోళ్లు.. చెప్పాలె కదా?
సంపత్ : సంఘం నుంచి చేసుకున్నడు.
వినయ్‌భాస్కర్ : లేబర్ సంఘమా.. పేరేంది? నాన్నకు కచ్చితంగా ఇన్సురెన్సు చేసుకోవాలని చెప్పు. ఇంకేం సమస్యలు ఉన్నయ్ తమ్ముడు?
సంపత్ : దాదాపు 70 శాతం మందికి టాయిలెట్స్ లేవు. ఆడవాళ్లు బయటికి వెళ్లాల్సి వస్తోందన్న..
వినయ్‌భాస్కర్ : బస్తీలో ఎంత మంది ఉంటరు.. సమస్య పోవాలంటే ఏం చేయూలె?
సంపత్ : 10 చొప్పున మూడు యూనిట్లు(30 టాయిలెట్స్) సరిపోతయన్న.
వినయ్‌భాస్కర్ : మరి నిర్వహణ ఎట్ల?  
సంపత్ : 4 యూత్ క్లబ్ ఉన్నయన్న. నాలుగు యూనిట్లు కడితే నిర్వహణలో ఇబ్బంది లేకుండా చూసుకుంటం.
వినయ్‌భాస్కర్ : అచ్చ.. ఇక రోడ్లు, డ్రెయిను, నీళ్లు కావాలె. ఇవే కదా.. సంపత్ నీ కోర్సు ఎప్పడయిపోతది. జాబ్ వస్తదా..?
సంపత్ : ఈ ఇయర్ అయిపోతదన్న. జాబ్ సాధిస్తా..
వినయ్‌భాస్కర్ : ఆల్ ది బెస్ట్ సంపత్.
సంపత్ : థ్యాంక్స్ అన్నా..
వినయ్‌భాస్కర్ : హలో తమ్ముడు, ఏం విషయాలు?
సర్కస్ రాజు : పదేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నం సార్. సర్కస్‌లు చేస్తం సార్. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేరు. మా సర్కస్‌ల 30 మంది దాకా ఎల్తరు. మేం నక్కలోళ్లం సార్. 100 గుడిసెలు ఉంటయి.
వినయ్‌భాస్కర్ : మీది ఏ ఊరు. ఎక్కడ గుడిసలేసుకున్నరు?
సర్కస్ రాజు : మాది రోకళ్ల శాయంపేట సార్. ఇక్కడికొ చ్చి ఐదేండ్లయితాంది. మన వాడకు గుడిసెలేసుకున్నం.
వినయ్‌భాస్కర్ : రేషన్ కార్డు ఉన్నదా?
సర్కస్ రాజు : కొందరికున్నయి.. కొందరికి రాలే సార్.
వినయ్‌భాస్కర్: ఎంత మంది పిల్లలు. చదువుకుంటున్నారా?  కార్డు ఎక్కడ కావాలె. ఇక్కడ్నా? రోకళ్ల శాయంపేటల్న?
సర్కస్ రాజు : పెద్దలు మీరు ఉన్నరు. ఎక్కడైనా పర్వాలేదు.. మీ దయ. స్థలం కావాలె. ఇళ్లు కావాలె.
వినయ్‌భాస్కర్ : అమ్మా.. మీ బస్తీల ఏం సమస్యలు ఉన్నయి. గతంలో ఎవరికన్నా చెప్పిండ్రా?
ఎల్లమ్మ : 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. మస్తు సమస్యలు ఉన్నయి. రోడ్లు సక్కగలేవు. తాగడానికి నీళ్లు లేవు. ట్యాంకర్లు వచ్చి పోస్తయి. రోజూ రావు. కార్పొరేటర్, నగర పెద్దలకు చెప్పినం. ఒక్క తట్ట మట్టి పోయలేదు.
వినయ్‌భాస్కర్ : అమ్మా కిరాణం షాపు యాపారం ఎట్లుంటది. రోజుకు లాభం ఎంతొస్తది. పిల్లలు ఏం జేస్తున్నరు.
శ్రీలత : రోజు రూ.500 గిరాకవుతది. రూ.50 వరకు లాభముంటది. పాప ఏడో తరగతి. బాబు ఒకటో తరగతి. నక్కలగుట్ట శ్రీచైతన్యలో చదువుతాండ్లు. 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. రోడ్లు, లైట్లు పెట్టాలె.
సరోజన : ఫస్ట్ గుడిసె మాదే. మణిరాం మేము వేసినం. పట్టాలు లేవు.. రోడ్లు లేవు.. నీల్లుగావాలె. మోరీలు సాప్‌లేదు.. స్తంభాలు లేవు. మొదట 15 గుడిసెలు ఉండె. ఇప్పుడు 750 గుడిసెలు ఉన్నయి. 3 వేల మంది ఉన్నరు. కష్టపడి ఇండ్లు కంటున్నం. ఇంటి నంబర్లు వచ్చినయి. పట్టాల కోసం కలెక్టర్ ఆఫీసు కాడికి పోతే ఒక్కొక్కర్ని లేబట్టి ఎత్తేసి కొట్టిండ్రు.
వినయ్‌భాస్కర్ : ఎప్పుడయ్యిందమ్మా.. ఎవరు రాలేదా?
సరోజన : పదేండ్ల కింద.. ఎవలు రాలె. అప్పడో కలెక్టరమ్మ వచ్చి సూసింది.. పోయింది.. ఇప్పుడు మీరే కాదుసారూ. తెల్లందాకా, పొద్దుందాకా ఇండ్లళ్ల పనిజేత్తం. రోడ్లు మంచిగ చేయాలె సారూ.
వినయ్‌భాస్కర్ : ఇంకా.. ఏం సమస్యలున్నాయమ్మా?
విజయ, లక్ష్మి : నీళ్లకు మస్తు గోసయితాంది. 20 ఏండ్ల కింద బోరేసిండ్రు. ఆరేండ్ల నుంచి నీళ్లత్తలేవు. అందరం పనికిబోయేటోళ్లం. పగటిపూట ట్యాంకర్లు వస్తే ఇబ్బంది అయితాంది.
గౌసియాబీ : ఇక్కడ ఉండబట్టి 15 ఏండ్లయ్యింది. మా ఆయన పోలీస్‌ల జేసేది. కాళ్లు,చేతులు పడిపోయి చని పోయిండు. ముగ్గురు పిల్లలు. ఇక్కడ ఏం బాగా లేదు.
వినయ్‌భాస్కర్ : ఇప్పుడు నీళ్ల సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు పెంచుతం. ఎప్పుడు రావాలె.
లక్ష్మీ : పొద్దున 8 గంటల లోపు వస్తే సరిపోతది. నాలుగు ట్యాంకర్లు అయితే సరిపోతయి సారూ..
ఎల్లయ్య : ఇప్పుడు ఇండ్లళ్లకు నీళ్లు వస్తానయ్. వర్షాకాలంలో వరదలు బాగా వస్తాయ్. అప్పుడు ఖాళీ జాగా ఉంటే గుడిసెలు వేసుకున్నం.
వినయ్‌భాస్కర్ : చెరువు శిఖంల వేసుకోవద్దని కోర్టు తీర్పు ఉన్నది కదా?
ఎల్లయ్య : అప్పుడు పని కోసం వచ్చినం. ఇప్పుడిట్ల ఉంది.
వినయ్‌భాస్కర్ : నా పేరు ఏందమ్మా ?
పెద్దమ్మ : నాకు తెల్వదు బిడ్డా.. అందరు ఎట్లున్నరో ఆ రోజు నీకు చెబితి కదా..
స్వర్ణలత : అప్పుడు బీజేపోళ్లు చెప్పిన్రు. పట్టాలు లేటుగ వస్తయని అన్నరు. ఇప్పుడు మీరే చెయ్యాలె అన్న. ఇంటి నంబర్లు ఇస్తలేరు.
వినయ్‌భాస్కర్ : మీ ఆయన పేరేంటమ్మా.. ఏంజేస్తరు?
స్వప్న : శ్రీనివాస్ సారూ.. ఆటో తోల్తడు.
వినయ్‌భాస్కర్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఆటోలకు మన సీఎం కేసీఆర్ రవాణా పన్ను తీసేసిండు. మీరు కడతలేరు కదా?
శ్రీనివాస్ : కడ్తలేమన్నా.
వినయ్‌భాస్కర్ : ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నరుు. ఈ కాలనీల ఎట్లున్నరమ్మా, సమస్యలున్నయా?
స్పప్న : అన్నీ సమస్యలే సారూ.. ఇళ్లు లేవు. రోడ్లు లేవు. నీళ్లు లేవు. సర్కారు దయ సూడాలె.
బిక్షపతి : కాలనీ ఏర్పడి 24 ఏండ్లయింది. ముప్పయి ఏండ్ల కింద చెరువు శిఖం.. ఇప్పుడు పరిస్థితి మారింది. సరైన గవర్నమెంట్ లేకనే అట్లయిందని అనుకుంటున్నం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మాకు సాయం చెయాలె.
వినయ్‌భాస్కర్ : నా నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు వచ్చాను. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి స్వయంగా పేదల సమస్యల తెలుసుకోవడం  ఆనందంగా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి నా శాయశక్తులా కృషిచేస్తా. థాంక్యూ..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు