కాలుష్యంతో వ్యాధుల ముప్పు

4 Nov, 2019 04:25 IST|Sakshi
సమావేశంలో దత్తాత్రేయ. చిత్రంలో కరుణాగోపాల్‌ తదితరులు

పారిశుద్ధ్య లోపం వల్లే డెంగీ కేసులు

మూసీని త్వరగా ప్రక్షాళన చేయాలి

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌

దత్తాత్రేయ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ ఆధ్వర్యం లో ‘హెల్త్‌ హైదరాబాద్‌’పేరుతో ఆదివారం స్టాఫ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీలో కరుణా గోపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు.

శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు