తల్లి అంత్యక్రియలకు కూతుళ్ల భిక్షాటన

7 Jul, 2019 10:10 IST|Sakshi
తల్లి అంత్యక్రియల కోసం తాతతో కలిసి భిక్షాటనకు బయల్దేరిన కూతుళ్లు

అంత్యక్రియలు చేసిన ముస్లిం నాయకులు

చివరి చూపునకు నోచుకోని కూతుళ్లు

సాక్షి,  జగిత్యాల : తల్లి అంత్యక్రియలకు డబ్బు లేక కూతుళ్లు భిక్షాటన చేసిన దైన్య ఘటన శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కొడుకు సైతం భిక్షాటన చేయగా... స్పందించిన ముస్లిం నాయకులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కూతుళ్లు కన్నతల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయారు. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన మస్తాన్‌ తన భార్య ముంతాజ్, చిన్నాన్న పెద్ద మస్తాన్,         ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాలకు నెల రోజుల క్రితం వచ్చారు. ఇక్కడే భిక్షాటన చేస్తూ జిల్లాకేంద్రంలోని టౌన్‌హాల్‌లో సేద తీరుతున్నారు. ఓ వైపు అర్ధాకలి, మరోవైపు అనారోగ్యంతో మస్తాన్‌ భార్య ముంతాజ్‌ శనివారం ప్రాణాలు విడిచింది. భార్య మృతితో మస్తాన్‌ నిశ్చేష్టుడయ్యాడు.

మస్తాన్‌ కూతుళ్లు ముంతాజ్‌(10), మున్నీ(7) తాతతో కలిసి తల్లి అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కోసం భిక్షాటనకు వెళ్లారు. మస్తాన్‌ చిన్నకొడుకు అబ్దుల్లాతో కలిసి భార్య శవం వద్ద ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న మెకానిక్‌లు స్పందించి అంత్యక్రియల కోసం తలాకొంత డబ్బు జమచేశారు. భిక్షాటనకు వెళ్లిన వారు సాయంత్రమైనా తల్లి శవం వద్దకు చేరుకోలేదు. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. చీకటి పడుతుండటంతో కూతుళ్లు రాకుండానే ముంతాజ్‌ శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భిక్షాటనకు వెళ్లిన కూతుళ్లు తల్లి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. రాత్రయినా పిల్లలు తండ్రి వద్దకు చేరుకోలేదు. 

మరిన్ని వార్తలు