వృద్ధుల డే కేర్‌..

26 Jan, 2018 16:02 IST|Sakshi
మలి వయసులో ఊసులు చెప్పుకునే చోటు..!

మంచిర్యాల నుంచి బన్నా ఉపేందర్‌ :  వారంతా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నవారే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం, మరొకరు ప్రైవేటు, మరొకరు వ్యవసాయం, వ్యాపారం.. ఇలా రకరకాలుగా అలుపెరగని జీవిత పోరాటం చేసి నేడు అలసిసొలసిన వృద్ధులు. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే ఏం తోచదు. బయటకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక తమ కష్టసుఖాలను నలుగురితో పంచుకుందామంటే, ఎవరు అందుబాటులో ఉన్నారో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న వృద్ధులకోసం ఏర్పాటైందే వృద్ధుల డే కేర్‌ సెంటర్‌.  రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం తీసుకుని స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లే దారిలోని కాలేజీరోడ్డులో ఉన్న ఓ పాత భవనాన్ని రూ. 20 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించి ఈ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భవన ఆవరణను అందమైన మొక్కలతో ముస్తాబు చేయించారు. గదిలో టీవీ, ఆడుకునేందుకు వస్తువులు, కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు, ఫిజియోథెరపీ పరికరాలు ఇలా అనేకం సమకూర్చారు.

ఈ డే కేర్‌ సెంటర్‌కు మహిళలు, పురుషులు ఎవరైనా ప్రతి రోజూ వచ్చి వెళ్లొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదు. అన్ని రకాల సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ సెంటర్‌ చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో, పచ్చని గార్డెనింగ్‌ను ఏర్పాటు చేసి, కేంద్రానికి వచ్చే వృద్ధులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నారు.

రాష్ట్రంలోనే మొదటిది..
తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధు లకు కాలక్షేపంతోపాటు, ఆరోగ్యాన్ని అందిం చేలా వైద్య పరీక్షలు, ఉల్లాసం, ఉత్సాహం నింపే లా ఆట వస్తువులు, వినోదం అందించేందుకు టీవీ, దినపత్రికలతో మంచిర్యాలలో వృద్ధుల డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ చొరవతో ఏర్పాటైన దీనికి ‘సన్‌షైన్‌ వృద్ధుల డేకేర్‌ సెంటర్‌’ అని పేరు పెట్టారు.

డే కేర్‌ సెంటర్‌ ఉద్దేశం..
వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, వారి హక్కుల గురించి గానీ, వారికి ప్రభుత్వం అందించే సదుపాయాలు, పథకాల గురించి తెలుసుకునేందుకు, కష్టసుఖాలు పంచుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాటు చేసిందే ఈ కేంద్రం. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ప్రతీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఫిజియో థెరపీ అవసరం ఉన్న వారికి సైతం ప్రత్యేకంగా ఒక బెడ్డు, సైక్లింగ్‌ వంటివి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల దిన పత్రికలు, వినోదాన్ని పంచేందుకు టీవీ, ఇండోర్‌ గేమ్స్‌తో కాలక్షేపం చేసేందుకు చెస్, క్యారంబోర్డు ఉన్నాయి. షటిల్‌కోర్టు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

ఇది మంచి వేదిక
అన్ని హంగులతో రూపొందించిన డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయ డం గొప్ప వరం. ఎక్కడా లేనివిధంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఈ ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు. వృద్ధులు అనేక విషయాలు పంచుకునేందుకు ఇదో వేదిక. 2007లో ఏర్పాటు చేసిన మెయిం టెనెన్సు సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంపై అవగాహన కల్పిస్తాం.
– బొలిశెట్టి రాజలింగు, జిల్లా సీనియర్‌ సిటిజన్‌ సంఘం అధ్యక్షుడు

మరో పదేళ్లు బతకొచ్చు..
వృద్ధులైన తర్వాత ఏం తోచక సమయాన్ని వృథా చేసుకుంటూ, ఆరోగ్యపరంగా, మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఈ డే కేర్‌ సెంటర్‌కు రావడం వల్ల కొత్త పరిచయాలు, కొత్త విషయాలను తెలుసుకోవడం, రోజంతా నవ్వుతూ, బాధలు, సంతోషాలను పంచుకుంటుండడం వల్ల మరో పదేళ్ల ఆయుష్షు పెరుగుతుంది.
– ఎన్‌. వెంకటేశ్వర్‌రావు, సీనియర్‌ సిటిజన్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు