తారక మంత్రం!

16 Nov, 2018 14:24 IST|Sakshi

నేడు జిల్లాకు కేటీఆర్‌

పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ సభ

భారీగా జన సమీకరణకు పార్టీ శ్రేణుల కసరత్తు

అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌ తారకమంత్రాన్ని జపిస్తోంది. యువనేత, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం జిల్లాకు రానున్నారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నిర్వహించే బహిరంగసభలో ఆయన మాట్లాడనున్నారు. జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. 

సాక్షి, పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రంగంపల్లిలోని ఆర్‌టీవో కార్యాలయం పక్కనున్న మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ జరగనుంది. కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు తదితరులు పాల్గొననున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత జిల్లాలో తొలి ప్రచార సభ కావడంతో భారీగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

కనీసం 15 నుంచి 20 వేల మందిని తరలించాలని పార్టీ నేతలు సన్నహాలు చేస్తున్నారు. పూర్తిగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సభ కావడంతో ఈ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభ విజయవంతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. జనసమీకరణ బాధ్యతను పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులకు అప్పగించారు. కాగా...కేటీఆర్‌ జిల్లాకు వస్తున్న సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

కేటీఆర్‌పై ఆశలు...
క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేందుకు, నేతలు ఏకతాటిపై వచ్చేందుకు తారక మంత్రం పనిచేస్తుందని పార్టీ భావిస్తోంది. నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఇటీవల ఒక్కటయ్యారు. వీరిలో మరింత ఐక్యత పెరిగేందుకు కేటీఆర్‌ పర్యటన దోహదం చేస్తుందనే ఆలోచనతో నేతలున్నారు. గులాబీ బాస్‌ కేసీఆర్‌ తనయుడిగా రాజకీయం అరంగేట్రం చేసిన కేటీఆర్‌ అనతికాలంలోనే స్వీయ నేతగా ఎదిగారు. మంత్రిగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయంగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. తండ్రి తరహాలోనే తన వాగ్ధాటితో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పార్టీ వర్గాలు సైతం ఆయనను భవిష్యత్‌ నాయకుడిగా పరిగణిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశ ప్రచార బాధ్యతలను పూర్తిగా కేటీఆరే ఎత్తుకున్నారు. 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కేసీఆర్, కేటీఆర్‌లు ప్రచారం చేపట్టే విధంగా పార్టీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ముందుగా కేటీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచార సభలు పూర్తి చేసిన అనంతరం, కేసీఆర్‌ సభలు ఉంటాయని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. కాగా సభల్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించడంతో పాటు, కూటమిపై విమర్శలను కేటీఆర్‌ ఎక్కుపెడుతున్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. మొత్తానికి పార్టీకి స్టార్‌కాంపేయినర్‌గా కేటీఆర్‌ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు