వెల్లివిరిసిన సాహితీ సౌరభం

17 Dec, 2017 01:53 IST|Sakshi

మహాసభల్లో రెండో రోజు ఆకట్టుకున్న కార్యక్రమాలు

అన్ని వేదికల వద్దా భాషా, సాహితీ ప్రియుల సందడి

తెలుగు భాషా వికాసంపై సాహిత్య సభ

అవధాన ప్రక్రియలో ‘ఆబాలగోపాలం’

అలరించిన హాస్యావధానం.. బాలకవి సమ్మేళనం

వేలాది మంది పాల్గొన్న సాహిత్య సభలు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్యోత్సాహం వెల్లివిరిసింది. భాషా సాంస్కృతిక వైభవం కనువిందు చేసింది. వేలాది మంది భాషా, సాహితీ ప్రియులు తెలుగు తల్లి ఒడిలో సేదతీరారు. అమ్మ భాషతో మమేకమై తన్మయులయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజు శనివారం హైదరాబాద్‌లోని సభా వేదికలన్నీ ప్రభం‘జనాలై’ భాసిల్లాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతోపాటు తెలంగాణ సారస్వత పరిషత్తు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి వరకు వేలాది మంది వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాహిత్య సభ
లాల్‌ బహదూర్‌ క్రీడా మైదానంలోని పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో బమ్మెర పోతన వేదికపై ‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’పై సాహిత్య సభ జరిగింది. వేల ఏళ్లుగా తెలుగు భాష పరిణామం చెందిన తీరుపై భాషా నిపుణులు మాట్లాడారు. కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, రవ్వా శ్రీహరి,  ముదిగంటి సుజాతారెడ్డి, ఎస్వీ సత్యనారాయణలు తెలంగాణలో తెలుగు భాషా వికాసాన్ని వివరించారు. అనంతరం జరిగిన హైదరాబాద్‌ సోదరుల ‘శతగళ సంకీర్తన’ సాంస్కృతిక కార్యక్రమం సభికులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. భక్త రామదాసు కీర్తనల ఆలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్పీకర్‌ మధుసూదనాచారి, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ అయాచితం శ్రీధర్, సినీనటుడు తనికెళ్ల భరణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక అలేఖ్య బృందం నృత్య ప్రదర్శన, వింజమూరి రాగసుధ నృత్యం, షిర్నికాంత్‌ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఎల్‌బీ స్టేడియంలో సాంస్కృతికోత్సాహం వెల్లువెత్తింది.

వెల్లువై జాలువారిన అవధానం..
తెలంగాణ సారస్వత పరిషత్తులోని మరిగంటి సింగనాచార్యుల ప్రాంగణంలో శతావ«ధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై ‘శతావధానం’ సాహిత్య వెల్లువై జాలువా రింది. గౌరీభట్ల మెట్టురామశర్మ శతావధా నం అందరినీ ఆకట్టుకుంది. మరే భాషలో నూ లేని ఈ అద్భుత సాహిత్య ప్రక్రియకు ఆయన పట్టం కట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభలను ఒక డాక్యుమెంటరీగా రూ పొందించనున్నట్లు ఆయన ఈ సంద ర్భంగా వెల్లడించారు. ఇక రవీంద్రభారతి లోని పైడి జయరాజ్‌ థియేటర్‌లో యువ జనోత్సవాలు ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా పలు చిత్రాలను ప్రదర్శించారు.

వికసించిన సాహితీ సౌరభాలు
తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై పద్యకవితా సౌరభాలు వెల్లివిరిశాయి. ‘తెలంగాణ పద్య కవితా సౌరభం’పై ఆచార్య అనుమాండ్ల భూమయ్య అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగనభట్ల నర్సయ్య, తూర్పు మల్లారెడ్డి, గురిజాల రామశేషయ్య తదితరులు పద్య కవితా వైభవంపై ప్రసంగించారు. మధ్యాహ్నం ‘తెలంగాణ వచన కవితా వికాసం’పై నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిరాజు రంగారావు, కూరెళ్ల విఠలాచార్య, జూలూరి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. వచన కవిత్వంపై సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పెన్నా శివరామకృష్ణ మాట్లాడారు.

హాస్యావధానం ఆనందభరితం..
రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలోని గుమ్మనగారి లక్ష్మీనరసింహ శర్మ ప్రాంగణంలో డాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై నిర్వహించిన హాస్యావధానం నవ్వులు పూయించింది. ఆబాల గోపాలం ఆనంద పరవ శులయ్యారు. అష్టావధానంలో డాక్టర్‌ మలుగ అంజయ్య తన సాహిత్య సాధికారతను సమున్నతంగా ఆవిష్కరించారు. హాస్యావధానంలో శంకర నారాయణ ఆహూతులను కడుపుబ్బా నవ్వించారు. మంత్రి లక్ష్మారెడ్డి, రాపాక ఏకాంబరాచారి, తనికెళ్ల భరణి తదితరులు ఈ అవధానంలో పాల్గొన్నారు. అనంతరం పద్య కవి సమ్మేళనం జరిగింది.

ఆకట్టుకున్న కవి సమ్మేళనం..
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం బృహత్‌ కవి సమ్మేళనంలో ఎందరో భాషా పండితులు, యువ కవులు, కవయిత్రులు తమ సృజనా త్మకతను ఆవిష్కరించారు. శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్ర మానికి దామెర రాములు అధ్యక్షత వహిం చారు. ఇక రవీంద్రభారతిలోని డాక్టర్‌ యశోదారెడ్డి ప్రాంగణంలో బండారు అచ్చమాంబ వేదిక ‘బాలసాహిత్యం’తో కొలువుదీరింది. రచయితలు పత్తిపాక మోహన్, చొక్కాపు వెంకటరమణ, వాసాల నరసయ్య, ఐతా చంద్రయ్య తదితరులు బాలసాహిత్యం గురించి ప్రసంగించారు.

వెల్లివిరిసిన సాహితీ సౌరభం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు