దర్జాగా వచ్చి దోచుకెళ్లారు

25 Jul, 2019 11:02 IST|Sakshi
చోరీ జరిగిన ఇంటి వద్ద పోలీసులు

తాళాలు వేసిన నాలుగిళ్లలోకి చొరబడి..

34 తులాల బంగారం, రూ.4.50 లక్షలు అపహరణ  

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. నాలుగిళ్లలోకి చొరబడి 35 తులాల బంగారం, రూ.4.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం పట్టపగలే జరిగిన ఈ చోరీతో కామారెడ్డిలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పరిధిలో ఉన్న విద్యుత్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండే మూడు కుటుంబాలు కలిసి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దగ్గర్లోని చుక్కాపూర్‌ నర్సింహాస్వామి ఆలయానికి వెళ్లారు. మాచారెడ్డి మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు భరత్‌రెడ్డి, లింగారెడ్డి రెండేళ్ల క్రితం కాలనీలో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు. చిట్‌ఫండ్‌ కంపెనీలో పని చేసే సోదరులిద్దరు తమ కుటుంబాలతో కలిసి బుధవారం తమ ఇళ్లకు తాళాలు వేసి చుక్కాపూర్‌కు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో దాచిన 20 తులాల బంగారం, రూ.3 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లాడు. ఎదురుగా నివాసముండే ఏఆర్‌ కానిస్టేబుల్‌ తారాసింగ్, జైపాల్‌ కుటుంబ సభ్యులు కూడా ఇళ్లకు తాళాలు వేసి చుక్కాపూర్‌ వెళ్లారు.

వీరిళ్లలోకి చొరబడిన దొంగలు రూ.70 వేల నగదు, 8 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న ఇంటి యజమాని వలిపిరిశెట్టి శరత్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను ఉదయాన్నే విధులకు వెళ్లగా, పిల్లలు పాఠశాలలకు వెళ్లారు. భార్య పావని ఇంటికి తాళం వేసి, టేక్రియాల్‌లోని తల్లిగారింటికి వెళ్లింది. ఆ ఇంటితాళాలు పగలగొట్టిన చోరులు 6 తులాల బంగారం, రూ.70 వేల నగదును దోచుకున్నారు. పక్కనే ఉన్న గల్లీలోని మరో ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లకుంట సంధ్య కుటుంబం ఇటీవలే కాలనీలో ఇల్లు కొనుక్కున్నారు. సంధ్య టైపింగ్‌ నేర్చుకునేందుకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చారు. అప్పటికే చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని రూ.10వేల నగదు, రెండు మాసాల బంగారం పోయినట్లు ఆమె తెలిపారు.

 ఒక్కడే వచ్చి దోచేశాడు...!
నాలుగిళ్లలో చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కాలనీలో అనుమానాస్పదంగా బైక్‌పై తిరుగుతూ, ఆయా ఇళ్లలోకి చొరబడినట్లుగా దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజీల్లో నిక్షిప్తమైనట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌ సీఐ భిక్షపతి, పలువురు ఎస్సైలు పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు