పదవులు 8.. ఓట్లు 3! 

23 Feb, 2020 10:13 IST|Sakshi

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో చోద్యం

బీ–క్లాస్‌ డైరెక్టర్‌ పదవులకు పోటీచేసే వారే కరువు

ఉమ్మడి జిల్లాలో 272 ప్రభుత్వ సంబంధిత సొసైటీలు

క్రియాశీలకంగా లేకనే ఈ పరిస్థితి అంటున్న అధికారులు

సాక్షి, ఆదిలాబాద్‌: డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్‌ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్‌ అధ్యక్షులను ఏ–క్లాస్‌ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్‌ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్‌ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్‌ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్‌ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్‌ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్‌ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. 

క్రియాశీలకంగా లేవు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు    సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్‌ ఇన్‌చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం.

వాటిలో టెలికం ఎంప్లాయీస్‌ కోఆపరేటీవ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్‌సింగ్‌ బీసీ లేబర్‌ కాంట్రాక్ట్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌తోపాటు మమతా సూపర్‌బజార్‌ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. 

ముగ్గురే మహిళలు..
డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్‌లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్‌ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్‌ సొసైటీ నుంచి ఆర్‌.శైలజ, ధర్మరావుపేట్‌ సొసైటీ నుంచి బడావత్‌ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్‌లోని 22 డైరెక్టర్‌ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్‌ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. 

ఐదు పదవులు మిగిలిపోనున్నాయి
బీ–క్లాస్‌ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్‌ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్‌ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి.     – మోహన్, డీసీవో, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు