ఎవరిదీ శవం?

4 Jun, 2020 10:34 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: రైల్వే పట్టాల పక్కన పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో నాలుగు రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ నెల 2న బన్సీలాల్‌పేట్‌కు చెందిన యువకుడు మిస్సింగ్‌ కావటంతో ఈ మృతదేహం అతనిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బైబిల్‌ హౌజ్‌ ప్రాంతంలోని రైల్వే పట్టాలకు దూరంగా చెట్ల పొదల్లో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారంతో మహంకాళి, గాంధీనగర్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

నిర్మానుష్య ప్రదేశం కావడం, పూర్తిగా చీకటిగా ఉండటంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.  మృతదేహాన్ని తరలించడం కూడా కష్టంగా ఉండటంతో అక్కడే ఉంచారు. గురువారం ఉదయం మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు చెప్పారు. గత నెల 31 నుంచి బన్సీలాల్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు మిస్సింగ్‌ అయ్యాడు. అతని బంధువులు ఈ నెల 2న గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన రోజు ఆ యువకుడు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో కలిసి ఉండటం గమనించిన స్థానికులు, బంధువులు పోలీసులకు ఈ విషయం చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిందితులను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బన్సీలాల్‌పేట్‌లో చంపేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌లు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు