రబీ రందీ..

19 Nov, 2014 03:19 IST|Sakshi

ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లంద ని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువలేదు. రబీలో ప్రాజెక్టుల కింద సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు.

జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 1088.6 మిల్లీ మీటర్లు కాగా కేవలం 734.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఈ ఏడాది -33 శాతం వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ పంటల పరంగా ప్రధానంగా పత్తి, సోయా, వరి దిగుబడులు అమాంతంగా పడిపోయి రైతన్నలు తీవ్ర దిగాలులో ఉన్నారు.

 నిరాశే..
 గతేడాది భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీటిని ప్రా జెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ కింద నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌లో సుమారు 35 వేల ఆయకట్టు ఉంది. రబీలో సరస్వతీ ఆయకట్టుకు నీరందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో స్వర్ణ నుంచి నీళ్లందించడం సాధ్యం కాద ని తేల్చిచెపుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆ యకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. ఈ ఏడాది కడెంలో నీటి సామర్థ్యం ఆందోళన కలిగిస్తోంది. సాగునీరు అందేది కష్టంగా నే కనిపిస్తోంది. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

ఖరీఫ్‌లో 14 వేల ఎకరాల వరకు నీరందుతుంది. టేల్ ఎండ్ వరకు నీరందని పరిస్థితి ఉంది. కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే సాత్నాల సాగు నీరందిస్తుంది. రబీ పంటలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాత్నాల నుంచి నీటి విడుదల లేదు. మత్తడివాగు కింద తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లో మాత్రమే నీరందుతుంది.

మరిన్ని వార్తలు