వేడెక్కిన ‘పుర’పోరు

14 Mar, 2014 23:22 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  మున్సిపల్ ఎన్నికల పోరు మరింత వేడెక్కింది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ఇక బలాబలాల ప్రదర్శనకు దిగనున్నారు. జిల్లాలోని ప్రధానమైన తాండూరు, వికారాబాద్, ఇబ్రహీంపట్నం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధానపార్టీలు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటాపోటీ పోరు జరుగనుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీరికి గట్టి పోటీ ఎదురుకానుంది.

ఇబ్రహీంపట్నంలో 20 వార్డులకు గాను ఎనిమిదింటిలో మాత్రమే టీఆర్‌ఎస్ అభ్యర్థులను నిలిపింది. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పోటీలో టీడీపీ తరఫున చిగుళ్లపల్లి రమేష్, టీఆర్‌ఎస్ నుంచి శుభప్రద పటేల్, కాంగ్రెస్ నుంచి విశ్వనాథ సత్యనారాయణ బరిలో దిగనున్నారు. తాండూరు, ఇబ్రహీంపట్నం స్థానాల్లో చైర్మన్ పదవి కోసం ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఆశావహులున్నారు. వీరిలో అసలైన పార్టీ అభ్యర్థి ఎవరనేది బీఫారాలు జారీ చేసిన తరవాత గానీ స్పష్టత వచ్చేలా లేదు.

 ‘పట్నం’లో ఖరారు కాని చైర్మన్ అభ్యర్థులు..
 ఇబ్రహీంటపట్నం నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను 215 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 80 మంది నామినేషన్ వేశారు. ఎస్సీకి కేటాయించిన మున్సిపల్ చైర్మన్ పదవికి పార్టీ తరఫున యాలాల యాదయ్య అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలిసింది. జనరల్ స్థానమైన 12వ వార్డు నుంచి యాదయ్య పోటీలో దిగుతున్నారు. టీడీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిత్వం కోసం కప్పరి లక్ష్మయ్య, ఈగల రాములు పోటీపడుతున్నారు. వీరిద్దరిలో పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది వేచిచూడాలి. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న పెద్ద అంబర్‌పేట కూడా ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం కావడంతో రెండింటిలో ఒకచోట చైర్మన్ పదవికి మహిళా అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో టీడీపీ ఉంది. అలాంటి పరిస్థితే వస్తే ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవినే మహిళకు కేటాయించే అవకాశం ఉంది. ఇక టీఆర్‌ఎస్ తరఫున అసలు చైర్మన్ అభ్యర్థులే లేరు.  

 వికారాబాద్‌లో నువ్వా..నేనా...
 వికారాబాద్ పురపాలక సంఘంలో మొత్తం 28 వార్డులకు గాను 249 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి చిగుళ్లపల్లి రమేష్, విశ్వనాథ సత్యనారాయణ, శుభప్రదపటేల్ పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రభావవంతమైన రెబల్ అభ్యర్థులు అంతగా లేకున్నా కొన్ని వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులైన అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది.

 తాండూరులో రసవత్తరం...
 తాండూరు పురపాలక సంఘంలో 31 వార్డులకు గాను 311 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే పోటీ ఉంది. టీఆర్‌ఎస్ నుంచి విజయాదేవి చైర్మన్ రేసులో ఉండగా, కాంగ్రెస్ నుంచి సీహెచ్ అనురాధ, బి.సునీత పోటీలో ఉన్నారు.  టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. 20 వార్డుల్లో స్వత్రంత్రులుగా పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు