ఓటర్ల నమోదు గడువు 15 వరకు పొడిగింపు

10 Dec, 2014 07:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇరు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. గత నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్లగా నమోదు, జాబితాల్లో సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
 
ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. దరఖాస్తులను, అభ్యంతరాలను 28వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటిస్తామన్నారు. ‘సీఈవోఆంధ్రా, సీఈవోతెలంగాణ’ సైట్ల ద్వారా ఓటర్‌గా నమోదుచేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు