చీటీ వచ్చినా చిక్కదే !

28 Aug, 2018 08:36 IST|Sakshi

వంట గ్యాస్‌ డీలర్ల చేతివాటం

డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్‌ఎంఎస్‌లు

సిలిండర్‌ తెచ్చి మళ్లీ బుక్‌ చేయాలంటున్న బాయ్స్‌

అత్తాపూర్‌కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్‌ ద్వారా సిలిండర్‌ను బుక్‌ చేసింది. నాలుగు రోజులు తరువాత  క్యాష్‌ మెమో కూడా జనరేట్‌ అయింది. అయితే సిలిండర్‌ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్‌ డెలివరీ అయినట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దీంతో    అవాక్కైన  ఆమె డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించగా మరో సారి బుక్‌ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు.  సిలిండర్‌ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో  చేసేదిలేక ఆమె మరోసారి బుక్‌ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్‌ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్‌ మాత్రం  ఇంటికి చేరలేదు.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గోపాల్‌ ఈనెల 15న గ్యాస్‌ బుక్‌ చేశారు.  రెండు రోజుల్లో క్యాష్‌ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్‌ సిలిండర్‌  ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్‌ క్యాన్సిల్‌ అయింది. తిరిగి బుక్‌ చేస్తే  తెచ్చిన సిలిండర్‌ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్‌ ముందే మరోసారి మొబైల్‌ ద్వారా బుక్‌ చేయక తప్పలేదు. బుకింగ్‌ ఎస్‌ఎంఎస్‌ చూసి సిలిండర్‌  డెలవరీ చేసి వెళ్లాడు బాయ్‌. ఆ తరువాత  సిలిండర్‌ డెలివరీ అయినట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. రెండో సారి బుకింగ్‌కు మరుసటిరోజు క్యాష్‌ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్‌ డెలవరీ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. అయితే సిలిండర్‌ మాత్రం రెండో సారి రాలేదు.  

సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్‌ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్‌ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్‌  ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్‌ బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్‌ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా  వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్‌) వంట గ్యాస్‌ రాజ్యమేలుతోంది. 

వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్‌ సిలిండర్లు...
ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్‌ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో  పెద్ద హోటల్స్‌  ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో  డొమెస్టిక్‌ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్‌ వంట గ్యాస్‌ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది.  

వాణిజ్య కనెక్షన్లు అంతంతే..
మహా నగరంలోని హైదరాబాద్‌–రంగారెడ్డి –మేడ్చల్‌  జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్‌ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్‌ సిలిండర్ల డిమండ్‌ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్‌ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు