డీలర్లే అక్రమార్కులు..!

9 Apr, 2016 02:03 IST|Sakshi
డీలర్లే అక్రమార్కులు..!

దారితప్పిన రేషన్ వ్యవస్థ
నల్లబజారుకు నీలి కిరోసిన్
రేషన్ బియ్యమూ పక్కదారి
కార్డుదారులకిచ్చేది అరకొరే
50 మందిపై కేసులు నమోదు

 
 
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిరుపేదలకు నిత్యావసర సరుకులు వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. అనేక ప్రాంతాల్లో డీలర్లు వినియోగదారుల పేరిట కోటా విడుదలైనా.. ఆ సరుకు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎంతోమంది డీలర్లు షాపుల్లో స్టాక్ పట్టికను నిర్వహించడం లేదు. అసలు రికార్డులు నిర్వహించని, సకాలంలో షాపులు తెరవని వాళ్లూ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో కనీసం 10 నుంచి 20 మధ్యలో డీలర్లు పట్టుబడుతూనే ఉన్నారు. వారికి ప్రతి నెల రెవెన్యూ డివిజనల్ అధికారులు రూ.7 వేలలోపు జరిమానా విధిస్తూ వదిలి పెడుతున్నారు. ఎన్ని జరిమానాలు విధించినా డీలర్ల తీరులో మార్పు రావడం లేదు.

ఏడాది కాలంలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన 50 మంది డీలర్లపై కేసులూ నమోదు చేశారు. వారి డీలర్ షిప్ రద్దు చేశారు. రికార్డులు, స్టాక్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు 1067 క్వింటాళ్ల బియ్యం, 8376 నీలి కిరోసిన్, 200క్వింటాళ్ల గోధుమలు, 30 క్వింటాళ్ల కందిపప్పు, 34 క్వింటాళ్ల చక్కెరస్వాధీనం చేసుకున్నారు.

అయినా.. క్షేత్రస్థాయిలో డీలర్లలో మార్పు రావడం లేదు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్ నల్లబజారుకు తరలిస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలాఖరు వరకు కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే నిబంధనలున్నా.. నెలకు ఐదు రోజులకు మించి రేషన్‌షాపులు తెరవడం లేదనే విమర్శలున్నాయి. మరోపక్క.. ఆ ప్రాంత ప్రజల పరిస్థితులను బట్టి ప్రతి రోజు నాలుగు గంటలు రేషన్ షాపులు తెరిచి ఉంచాల్సి ఉండగా.. కొందరు రోజుకు రెండు గంటలు మాత్రమే షాపులు తె రిచి తర్వాత మూసేస్తున్నారు. దీంతో కార్డుదారులు సరుకుల కోసం రేషన్ షాపులే కాదు.. డీలర్ల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షించాల్సిన పలువురు డీటీ(ఎన్‌ఫోర్స్‌మెంట్)ల పనితీరుపైనా విమర్శలొస్తున్నాయి. పలువురు డీటీల అండదండలతో డీలర్లు అక్రమాలకు తెరలేపారు. ముఖ్యంగా మంచిర్యాల పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉండడం.. రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు చెందిన డీలర్లు నిత్యావసర వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఒకప్పుడు మంచిర్యాల కేంద్రంగా రేషన్ బియ్యం, గోధుమలను ఇతర ప్రాంతాలకు తరలించి బడా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారి మిల్లులు, గోదాములపై మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గతంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అక్రమార్కులు సెలైంట్‌గా ఉండడంతో.. తూర్పు ప్రాంత పరిధిలో ఉన్న డీలర్లు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు తెలిసింది. రెండ్రోజులకోసారి జిల్లాలో ఏదో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పట్టుబడుతునే ఉన్నాయి.

 జిల్లాలో 7.38 లక్షల కార్డులు
జిల్లాలో 7.38 లక్షల పైచిలుకు ఆహార భద్రత కార్డులున్నాయి. 23లక్షల మందికి రేషన్ సరుకులు అందుతున్నాయి. 1443 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ అవుతున్నాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్ల కిరోసిన్, గ్యాస్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కార్డుదారుల్లో సుమారు 3లక్షల మంది ప్రతి నెలా నిత్యావసర సరుకులు రేషన్ షాపుల నుంచి తీసుకోరు. వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం, వేలాది లీటర్ల కిరోసిన్ ప్రతి నెలా మిగిలిపోతోంది. దీంతో రేషన్‌డీలర్లే ఆ బియ్యం, కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

పలు చోట్ల నిత్యావసర వస్తువుల కోసం షాపులకు వెళ్లిన వినియోగదారులకు అన్ని సరుకులు కాకుండా ఒకటి, రెండు రకాలు మాత్రమే ఇచ్చి పై నుంచి ఇంకా కోటా రాలేదంటూ డీల ర్లు తిరిగి పంపుతున్నారు. దీంతో ఇచ్చిన సరుకులే చాలంటూ.. వినియోగదారులు ఇచ్చిందే తీసుకుని వెనుదిరుగుతున్నారు. మరోపక్క జిల్లాలో మూడొందలకు పైగా రేషన్ దుకాణాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు షాపులు మంజూరు చేయొచ్చనే నిబంధన ఉండడంతో దాన్ని సాకు గా చేసుకుని కొందరు నేతలు తమ పలుకుబడితో బంధువులకు రేషన్ షాపులు ఇప్పించుకున్నారు. బినామీ పేరిట షాపులు నిర్వహిస్తూ.. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రజలూ సదరు డీలర్లపై ఫిర్యాదు చే సేం దుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు షాపులు నిర్వహించని డీలర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
 
 కఠినంగా వ్యవహరిస్తాం
రేషన్ డీలర్లంద రూ సమయపాలన పాటించడంతోపాటు కార్డుదారులందరికీ ప్రతి నెల విధిగా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. కార్డుదారులందరికీ సరుకులందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెల సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. రెగ్యులర్ యాక్టివిటీస్, బోర్డుపై స్టాక్ వివరాలు, సమయపాలన పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. సరుకులు పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. - ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు