48 గంటల్లో మరణ ధ్రువీకరణ పత్రం

13 Aug, 2018 02:10 IST|Sakshi

పంచాయతీరాజ్‌కు శాఖకు సీఎం ఆదేశం

రైతులకు బీమా క్లెయిమ్స్‌లో జాప్యం ఉండొద్దు

గ్రామ కార్యదర్శులు వేగంగా స్పందించాలి

పది రోజుల్లో నామినీకి బీమా సొమ్ము

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న వ్యవసాయశాఖ

రేపట్నుంచే రైతులకు బీమా అమలు

సాక్షి, హైదరాబాద్‌: రైతు బీమా కింద క్లెయిమ్స్‌కు అవసరమైన రైతు మరణ ధ్రువీకరణ పత్రం ఇక 48 గంటల్లోనే రానుంది. ఈ పత్రాలను అందించడంలో గ్రామ కార్యదర్శి వేగంగా స్పందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకవేళ రైతు పట్టణాల్లో చనిపోయినా మున్సిపల్‌ కమిషనర్‌ 48 గంటల్లోగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని సీఎం స్పష్టంచేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 14 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు బాండ్ల పంపిణీ పూర్తికానుంది. మంగళవారం నుంచి రైతులెవరైనా చనిపోతే వారికి ఎల్‌ఐసీ నుంచి బీమా సొమ్ము అందనుంది. బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసిన వ్యవసాయ శాఖ.. ఇప్పుడు క్లెయిమ్స్‌ ఇప్పించే అంశంపై దృష్టి సారించింది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని ఎల్‌ఐసీనే చేపట్టాలి. కానీ ఎల్‌ఐసీకి విస్తృత నెట్‌వర్క్‌ లేనందున ఆలస్యమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. అందుకే ఎక్కడైనా రైతు చనిపోయిన వెంటనే తక్షణమే వారికి మరణ ధ్రువీకరణ ఇప్పించడంతోపాటు ఇతరత్రా అన్ని వివరాలను ఎల్‌ఐసీకి పంపి పది రోజుల్లో క్లెయిమ్స్‌ ఇప్పించాలని నిర్ణయించింది.

27 లక్షల మంది రైతులకు బీమా
రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందించడమే రైతు బీమా ఉద్దేశం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉండి, రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ బీమా సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ నివేదిక ప్రకారం 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు. ఇందులో 27,00,416 మంది రైతులు నిబంధనలకు అనుగుణంగా బీమాకు అర్హులయ్యారు.

వారిలో ఎవరైనా చనిపోతే మంగళవారం నుంచి బీమా క్లెయిమ్స్‌ అందిస్తారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోనే క్లెయిమ్స్‌ అందించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది. అందుకు నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సహకారంతో వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోతే వ్యవసాయశాఖ అధికారులు.. క్లెయిమ్‌ కం డిశ్చార్జి ఫారం, మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ కాపీ, సదరు రైతు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ, నామినీ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ, రైతు బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌లను స్కాన్‌ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

ఎన్‌ఐసీకి ఆ సమాచారం పంపుతారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్‌ఐసీ నుంచి ఆటోమెటిక్‌గా ఎల్‌ఐసీకి రైతు డాక్యుమెంట్లతో సమాచారం వెళ్తుంది. డాక్యుమెంట్లను పరిశీలించిన వెంటనే ఎల్‌ఐసీ వర్గాలు నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్‌ సొమ్ము జమ చేస్తారు. మరోవైపు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది రైతులు బీమా పథకంలో చేరేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు