రుణం.. భారమై..!!

29 Sep, 2015 00:01 IST|Sakshi
రుణం.. భారమై..!!

- బోర్లు.. పంట సాగుకోసం రూ.2లక్షల మేర అప్పు
- రుణమాఫీ మొత్తాన్ని వడ్డీకిందికి జమకట్టుకున్న బ్యాంక్ అధికారులు
- దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతన్న
- శాలిపేటలో విషాదం
చిన్నశంకరంపేట:
సాగును వదులుకోలేక అప్పు తెచ్చిమరీ బోర్లు వేశాడు కానీ, ఎందులోనూ చుక్క నీరు రాలేదు. సరేలే అని మొక్కజొన్న సాగుచేశాడు.. వర్షం లేక అదీ ఎండిపోయింది. మరోవైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు.. దీంతో కలత చెందిన ఓ రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన భల్యాల ఎల్లం(34) తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల్లో వరిసాగు కోసం రూ.60వేలు అప్పు తెచ్చి ఆరు నెలల క్రితం రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీరు రాలే దు.

దీంతో వరి సాగును విరమించుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కానీ, వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోతుంది. పంట చేతికొచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. మరో వైపు రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వడ్డీ కిందకు జమచేసుకున్నారు. అలాగే భూమి కంటే ఎక్కువ రుణం పొంది నట్లు పేర్కొంటూ బ్యాంక్‌లోని రూ.8 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కూడా కలుపుకున్నారు.

రెండో విడత రుణమాఫీ మొత్తాన్ని కూడా వారే పట్టుకున్నారు. దీంతో పంట సాగు కోసం మరో రూ.50వేలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చాడు. బ్యాంక్ రుణంతో కలిపి రూ.2లక్షలకు అప్పులు చేరుకున్నా యి. సాగుచేసిన పంట కూడా ఎండిపోతుండడంతో కలత చెందిన రైతు ఎల్లం సోమవారం ఉదయం తల్లి, భార్య మొక్కజొన్న చేను వద్దకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృ తుడి భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ నగేష్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు