నిరుపేదను ఆదుకోరూ..!

7 Apr, 2018 10:39 IST|Sakshi
పిల్లలతో జెల్ల చందన, చెత్తాచెదారం మధ్య టెంట్‌ కింద ఉంచిన జెల్ల కిరణ్‌ మృతదేహం(ఫైల్‌) 

గుండెపోటుతో కుటుంబపెద్ద మృతి

దిక్కుతోచని స్థితిలో భార్యాపిల్లలు

ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకోలు

భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్‌ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్‌(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్‌స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్‌ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది  పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. 
వేధించిన అప్పులు.. 
అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్‌ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు...
ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్‌వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్‌ క్లబ్‌ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్‌ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా నంబర్‌ (నల్లగొండ మైత్రి ఉమెన్స్‌ కాలేజ్‌ బ్రాంచ్‌)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది.

మరిన్ని వార్తలు