నేతన్నకు రుణమాఫీ

28 Jul, 2018 13:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి జిల్లాలో 2,167 మంది చేనేత కార్మికుల గుర్తింపు

రుణమాఫీ కానున్న  రూ.7.27 కోట్లు

ఇప్పటికే ఆయా జిల్లాల్లో సమావేశాలు

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు  రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుంది. ఆ హామీని అమలు చేసేందుకు  రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయిలో లబ్ధిదారుల గుర్తిం పుతోపాటు రుణమాఫీ అమలు చేస్తే వర్తించే బ్యాంకులు, లబ్ధిదారుల స్టేటస్‌ తదితర  సమగ్ర వివరాలతో జిల్లా కమిటీ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికను  కలెక్టర్‌ ఆమోదంతో చేనేత జౌళిశాఖ రాష్ట్ర శాఖకు నివేదికను అందించారు.  రుణమాఫీ చేస్తే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2,167 మంది చేనేత కార్మికులకు  రూ.7.27 కోట్ల లబ్ధి చేకూరనుంది.

రెండు విధాలుగా రుణ మాఫీ.. 

1 ఏప్రిల్, 2010 నుంచి 31 మార్చి 2017 వరకు చేనేత కార్మికులు పొందిన రుణాల్లో లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూల రుణ మొత్తాన్ని చేనేత జౌళి శాఖ భరిస్తే, వడ్డీ మొత్తాన్ని బ్యాంకులు భరిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కాల పరిమితిలో రుణం పొంది అప్పులు తిరిగి చెల్లించిన వారికి  రూ.లక్ష రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణాలు పొందిన చేనేత కార్మికులకు రూ.లక్ష ప్రయోజనం కలుగుతుండడం గమనార్హం. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులతో  రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది.

లబ్ధిదారుల ఖరారు.. 

ఈ పథకం అమలు కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, చేనేత జౌళి శాఖ అధికారి, నాబార్డ్‌ ఏజీఎం,  డీసీసీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార శాఖ ఆడిట్‌ అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ జిల్లాలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి చేనేత రుణాలు పొందిన వారి వివరాలు సేకరించి ఇటీవల నేతన్నకు రుణమాఫీఆయా జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల గుర్తించారు.

అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది. 

ప్రభుత్వానికి నివేదికలు పంపాం

చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ రుణమాఫీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారందరివి ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.  –రమేష్, చేనేత జౌళి శాఖ ఏడీ, వరంగల్‌ రూరల్‌ 

మరిన్ని వార్తలు