రెండువారాల్లో రుణమాఫీ  

22 Aug, 2018 13:04 IST|Sakshi
రామన్నపేట :  రుణమాఫీ ప్రతిపాదనల ఫైళ్లను పరిశీలిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి 

చేనేత జౌళిశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

రామన్నపేట( నకిరేకల్‌ ) :  రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.40 కోట్ల రుణమాఫీ ప్రకియ రెండువారాల్లో పూర్తవుతుందని రాష్ట్ర చేనేత జౌళిశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని ఎస్‌బీఐ, కెనరాబ్యాంక్‌లలో రుణమాఫీ కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా అందిన ప్రతిపాదనల జాబితాను పరిశీలించారు.  బ్యాంకు మేనేజర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆయన స్థానిక మాట్లాడుతూ రాష్ట్రంలో 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2017మార్చి 31 మద్యకాలంలో వివిధ బ్యాంకుల ద్వారా సుమారు 12వేల మంది చేనేత కార్మికులు తీసుకున్న రూ.40కోట్ల రుణాలను మాఫీ చేయుటకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

ప్రభుత్వం నిర్ధేశించిన కాలంలో రుణాలు తీసుకుని సక్రమంగా డబ్బులు చెల్లించిన చేనేతకార్మికులకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. రుణమాఫీకి సంబంధించి కలెక్టర్‌లు అందజేసిన ప్రతిపాదనలను బ్యాంకులవారిగా పరిశీలించే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందన్నారు. పరిశీలన ముగిసిన వెంటనే మాఫీకి సంబంధించిన మొత్లాన్ని బ్యాంకుఖాతాల్లో జమచేయడం జరుగుతుందని వివరించారు.

యాదాద్రిభువనగిరి జిల్లాలో రుణమాఫీ ద్వారా 3,653 మంది చేనేత కార్మికులకు సంబంధించి 13.65కోట్ల రుపాయాల రుణాలు మాఫీ అవుతాయన్నారు.  రుణాల వసూలుకోసం కార్మికులను ఒత్తిడి చేయవద్దని స్టేట్‌లెవల్‌ బ్యాంకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.  ఆయనవెంట సహాయ అభివృద్ధి అధికారులు కళింగరెడ్డి, చంద్రశేఖర్, సంఘ అధ్యక్షుడు వనం సుధాకర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు