జీఎస్టీ పన్నుల భారంపై 11న నిర్ణయం

4 Jun, 2017 01:22 IST|Sakshi
జీఎస్టీ పన్నుల భారంపై 11న నిర్ణయం

 హోటళ్లు, గ్రానైట్‌ పరిశ్రమల సమస్యలు వివరించాం: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల వివిధ రం గాలపై పడనున్న అదనపు భారంపై ఈ నెల 11న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమా వేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీలో అన్ని రకాల గ్రానైట్‌ పరిశ్ర మలను 28 శాతం శ్లాబ్‌లో చేర్చడంపై సంబంధిత వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, హోటళ్ల యాజమాన్యాలు కూడా పన్ను విధింపుపై పునరాలోచించాలని డిమాండ్‌ చేస్తున్నాయని, ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.

ఈ సమస్యలపై పూర్తి వివరా లను సమర్పించాలని తమను కేంద్రం ఆదేశించినట్టు తెలిపారు. బీడీ పరిశ్ర మలపై పన్ను విధించవద్దని తెలంగాణ విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలే దని, బీడీ ఆకులపై 18 శాతం, బీడీలపై 28శాతం పన్ను నిర్ణయించారని తెలిపారు. పాఠశా లల నిర్వహణకు తీసుకొనే బిల్డింగులపై, నిరుద్యో గులు శిక్షణ సంస్థలకు చెల్లించే ఫీజులపై సేవా పన్ను, కళ్లద్దాలు, ఫ్యాన్ల తయారీపై విధించిన పన్నులపై ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్లను కేంద్రానికి తెలిపామన్నారు. జీఎస్టీ అమలులో ఇప్పటి వరకు 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, మిగిలిన కొన్ని ప్రతికూల అంశాలపై వచ్చే సమావేశంలో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు