కుటీర పరిశ్రమ కుదేలు!

5 Dec, 2017 03:31 IST|Sakshi

చేతి వృత్తులు, కుల వృత్తులకు కష్టకాలం

16,377 నుంచి 10,995కు తగ్గిన కుటీర పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్లు

2014–15తో పోల్చితే 2015–16లో మూడో వంతు మూసివేత

అర్థ గణాంక శాఖ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు అంతరించిపోతున్నాయా? ఏటా తగ్గిపోతున్న కుటీర పరిశ్రమల విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య ఇందు కు అవుననే సమాధానమిస్తోంది. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 2014–15లో 16,377 కనెక్షన్లు ఉండగా 2015–16లో ఆ సంఖ్య 10,995కు పడిపోయింది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన వార్షిక గణాంకాల పుస్తకం–2017 దీన్ని బహిర్గతం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని కేటగిరీల కింద విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగ్గా, కుటీర పరిశ్రమల కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.

కుటీర పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఏటా మూతబడుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఏటా రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కుల వృత్తులు, చేతి వృత్తులు చతికిలబడిపోతున్నాయి. కుటీర పరిశ్రమల స్థితిగతులపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదని, దీన్ని ధ్రువీకరించలేమని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థితిగతుల సమాచారమే ఆ శాఖ వద్ద ఉంది. కుటీర పరిశ్రమల నమోదుకు యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం.

బడా పరిశ్రమలతో పోటీ: ధోబీ ఘాట్లు, పవర్‌ లూమ్స్, వడ్రంగి, కుమ్మరి, కంచారి, స్వర్ణకార, శిల్పి, కమ్మరి, ఫినాయిల్, అగర్‌బత్తి, కోవత్తి, అప్పడాలు, చెప్పులు, సబ్బుల తయారీ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఉత్పత్తులు, ఫల కాలు, కొయ్యలతో బొమ్మల తయారీ, పచ్చళ్లు, మ్యాంగో జెల్లీ, విస్తరాకుల తయారీ పరిశ్రమలను రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు కుటీర పరిశ్రమలుగా పరిగణించి యూనిట్‌కు రూ.3.75 చొప్పు న చార్జీలు వసూలు చేస్తున్నాయి. 10 హెచ్‌పీల విద్యుత్‌ లోడ్‌లోపు వినియోగిస్తే కుటీర పరిశ్రమలుగా గుర్తిస్తున్నాయి.

విద్యుత్‌ లోడ్‌ 10 హెచ్‌పీలకు మించితే ఈ పరిశ్రమలను ఎల్టీ–పరిశ్రమల కేటగిరీ కింద చేర్చి రూ.6.70 చార్జీలు విధిస్తున్నాయి. చెరుకు క్రషింగ్, రొయ్యలు, చేపల పెంపకం పరిశ్రమలను ఎల్టీ–3 పరిశ్రమల కేటగిరీ నుంచి కుటీర పరిశ్రమల కేటగిరీలోకి మార్చాలన్న డిస్కంల ప్రతిపాదనలను 2016– 17 విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వుల్లో ఈఆర్సీ తిరస్కరించింది. నిరంతర విద్యుత్‌ ఇస్తున్నా, చార్జీలు పెంచకున్నా కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గిపోవడం వెనక బడా పరిశ్రమలతో ఎదురవుతున్న పోటీయే కారణమని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను భారీ పరిశ్రమలు తక్కువకే అందిస్తుండటంతో కుటీర పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోతున్నాయని ఆ శాఖ సీనియర్‌ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

విద్యుత్‌ సమస్య కాదు: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కుటీర పరిశ్రమల నుంచి తొలగించి కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కేటగిరీ కింద చేర్చడంతోపాటు వాటి విద్యుత్‌ చార్జీలను తగ్గించామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు.

5 హెచ్‌పీ విద్యుత్‌ లోడ్‌ లోపు విద్యుత్‌ వినియోగించే పరిశ్రమలు కుటీర పరిశ్రమల కేటగిరీ కింద వస్తాయన్నారు. కొన్ని పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌ లోడ్‌ 5 హెచ్‌పీకి మించిపోతే సాధారణ పరిశ్రమల కేటగిరీలో చేరుతాయన్నారు. దీంతో కుటీర పరిశ్రమల కేటగిరీ విద్యుత్‌ కనె క్షన్లు తగ్గి ఉంటాయని అన్నారు. విద్యుత్‌ కారణంతో కుటీర పరిశ్రమలు మూతబడేందుకు అవకాశామే లేదని కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు