పాతాళంలో గంగమ్మ

9 May, 2014 03:07 IST|Sakshi
పాతాళంలో గంగమ్మ

 హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. సగటున 10.59 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోగా... పలు మండలాల్లో నీటి లభ్యత గగనంగా మారింది. వేసవిలో ఎండ వేడిమికి తోడు నీటి వినియోగం అధికం కావడంతో  24 మండలాల్లో భూగర్భ జలమట్టం 10 మీటర్ల నుంచి 24 మీటర్ల లోతుకు దిగజారినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాడ్వా యి, కొత్తగూడ, స్టేషన్ ఘన్‌పూర్, చిట్యాల, చేర్యాల, రఘునాథపల్లి, ములుగు ప్రాంతాల్లో  ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 9.33 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు... ఈసారి ఏకంగా 10.59 మీటర్ల లోతుకు పడిపోయాయి.
 
 దాదాపు 310 గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసే బావులు ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో మూడు నెలల క్రితం వరకు  నీటితో కళకళలాడిన వ్యవసాయ బావులు, చెరువులు సైతం ఎండిపోవడంతో గ్రామాలు, తండాల ప్రజలు అల్లాడుతున్నారు. వాస్తవంగా ఏప్రిల్ ఆఖరు వరకే జిల్లాలో సగటున  10.59 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పుడు ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో భూగర్భ జలమట్టం మరింత లోతుకు పడిపోయే సూచనలు కనిపిస్తున్నారుు. ఇప్పటికే పాతాళంలోకి చేరిన నీళ్లు... మరింత లోతుల్లోకి వెళ్లితే జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని అధికారులు భావిస్తున్నారు.
 
 పట్టణాల్లో సైతం మంచి నీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పలు రిజర్వాయర్ల కింద మూడో పంటకు సిద్ధమవుతున్న రైతులకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భూగర్భజలాలు పడిపోతున్నాయని.. వాగులు, వంకలు ఎండిపోయాయని... భూములు నోళ్లు తెరుచుకుంటున్నాయని... ఇప్పుడు పంటలు సాగు చేస్తే... సాగునీరు ఎంత పారించినా, పంటలకు లాభం ఉండదని వారికి సూచిస్తున్నారు. అదేవిధంగా కొత్త బావుల తవ్వకానికి బ్రేక్ వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. బోర్లు వేసేందుకు కూడా అనుమతివ్వడం లేదు.
 
 ఇక్కడ మరీ అధ్వానం

కొత్తగూడ మండలంలో గత ఏడాది ఏప్రిల్‌లో 20.16 మీటర్ల లోతులో జలం ఉండగా... ఈ సారి 24.63 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదికి అదనంగా 4.47 మీటర్ల లోతుకు జలమట్టం దిగజారిందన్న మాట.

రఘునాథపల్లి మండలంలో 2013 ఏప్రిల్‌లో 13.23 మీటర్ల లోతులో ఉన్న జలమట్టం... ఈ ఏడాది అదే నెలలో 18.49 మీటర్లకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 5.26 మీటర్ల లోతుకు పడిపోయింది.

చిట్యాల మండలంలో గత ఏడాది ఏప్రిల్‌లో 16.32 మీటర్ల లోతులో జలం ఉండగా... ఈ సారి 19.75 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదికి అదనంగా 3.43 మీటర్ల లోతుకు జలమట్టం దిగజారింది.

>
మరిన్ని వార్తలు