8 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

3 Sep, 2015 06:51 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు డీఈఈసెట్-2015 పరీక్షకు హాజరై అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 8 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. మార్కుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఓసీ/బీసీ అభ్యర్థులైతే 100 మార్కులకు గాను 35 మార్కులు వస్తే అర్హులేనని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ లేవని, పరీక్షకు హాజరైతే వారిని అర్హులుగానే ప్రకటించినట్లు వెల్లడించారు.

విద్యార్థులు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్/తత్సమాన, ఎస్‌ఎస్‌సీ/తత్సమాన, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ లేదా రెవెన్యూశాఖ జారీ చేసిన నివాస, కులం సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు tsdeecet.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు.

మరిన్ని వార్తలు