వామపక్షాల్లో అంతర్మథనం...

27 May, 2019 03:04 IST|Sakshi

కనీస పోటీ ఇవ్వలేకపోవడంపై ఆందోళన

సంప్రదాయ ఓటు సైతం చెదిరిపోవడంపై నిరుత్సాహం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వరస ఎన్నికల్లో తమకు పడిన ఓట్లు, అసెంబ్లీ నుంచి లోక్‌సభ వరకు వెలువడిన ఫలితాల తీరు పట్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్మథనం సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచేంతగా ఈ పార్టీలకు సంస్థాగతంగా బలం లేకపోయినా, కనీస పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపకపోగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. కొంతకాలంగా వామపక్షాలకు సంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న వర్గాలు కూడా దూరం కావడంపట్ల నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీల ప్రలోభాలకు జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోని కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం లోనుకావడం, ఆయా పార్టీలకు అనుకూలంగా పనిచేయడం వంటి ఉదంతాలు పెరుగుతుండడంపట్ల ఈ పార్టీల్లో లోతైన సమీక్ష జరుగుతోంది.

నిబద్ధత, అంకితభావంతో పనిచేసే కేడర్, నాయకులు క్రమక్రమంగా తగ్గిపోవడం, పార్టీ శ్రేణులకు నాయకత్వం భరోసా కల్పించలేకపోవడం వంటివి ఈ పార్టీలకు ప్రమాద సంకేతాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎడతెగని పోరాటాలు, రైతులు, కూలీలు, కార్మికులు, ఇతర వర్గాల పక్షాన నిలిచి పోరాడిన చరిత్ర ఈ పార్టీలకుంది.ఈ పరిస్థితికి భిన్నంగా మొక్కుబడి నిరసనలు, మీడియాలో ప్రచారంకోసం చేసే ఉద్యమాలకు పరిమితం అవుతున్నాయనే విమర్శలు కూడా ఈ పార్టీలు ఎదుర్కొంటున్నాయి.

2004లో సీపీఐ, సీపీఎంలకు కలిపి 60 లోక్‌సభ స్థానాలకుపైగా ఉండగా, ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకే పరిమితం కావడం వామపక్షాలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని ఎత్తిచూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులొకరు అన్నారు. ఇది ఒక్క తెలంగాణకే పరిమితమైన ట్రెండ్‌ కాదని, దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలకు ఎదురుగాలి వీస్తున్నందున మారిన పరిస్థితులకు అనుగుణంగా వామపక్షశక్తుల పునరేకీకరణ జరగాల్సి ఉందని ఒక ముఖ్యనేత అభిప్రాయపడ్డారు. లోతైన విశ్లేషణలు, సమీక్షలు నిర్వహించి, లోపాలు, లోటుపాట్లను అధిగమించి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు