‘దీపం’ వెలిగేనా..

18 Apr, 2018 11:30 IST|Sakshi

ఉజ్వల యోజన పథకం కింద పేదలకు ఉచితగ్యాస్‌ కనెక్షన్లు

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తహసీల్దార్లకు  

జిల్లాలో 98, 598 కుటుంబాలకు కట్టెల పొయ్యే గతి  

అశ్వాపురం: గ్రామీణ ప్రాంత మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి కట్టెల పొయ్యి కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. వారి కష్టాలు తప్పడం లేదు. మహిళలు పొగ బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తోంది. ఆహారభద్రత కార్డు ఉండి, గ్యాస్‌ లేని వారికి కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో పేదలకు ఉచితంగా గ్యాస్‌ ఇచ్చేందుకు చర్యలుతీసుకుంటోంది. జిల్లాలో 2,75, 536 ఆహారభద్రత కార్డులు ఉండగా 1,76, 938 కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 98, 598 కుటుంబాలు కట్టెల పొయ్యితోనే కాలం వెల్లదీస్తున్నాయి. 

తహసీల్దార్లచే ఎంపిక..
దీపం పథకంలో అర్హుల ఎంపిక బాధ్యతలు రాష్ట్ర  ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో ఎంపీడీఓలు చూసేవారు. అయితే అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తహసీల్దార్లకు అప్పగించారు. ఆహారభద్రత కార్డుల జారీచేసేది వారే కాబట్టి అర్హుల  ఎంపిక ప్రక్రియ వేగవంతమవుతుందనే ఉద్దేశంతో మార్పులు చేశారు. అర్హులైన వారు తమ ఆధార్, ఆహారభద్రత కార్డులు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌లతో తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేస్తారు. గ్రామసభ ఆమోదంతో తుది జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత కలెక్టర్‌ అనుమతితో కనెకషన్లు మంజూరు చేస్తారు.  

ప్రధానమంత్రి ఉజ్వల యోజన..
పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్రం ఈనెల 14న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది.     అర్హులైన వారికి ఉచితంగానే గ్యాస్‌ అందించనుంది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం లేకుండా కనెక్షన్ల మంజూరు బాధ్యతను ప్రైవేటు కంపెనీల డీలర్లకు అప్పగించింది. వారు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 20 నుంచి ప్రత్యేక మేళాలు నిర్వహించి కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాల శాఖకు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉజ్వల పథకం రావడంతో ప్రస్తుతం అమలవుతున్న దీపం పథకం ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అన్ని మండలాలలో అర్హులైన వారు తహసీల్దార్‌ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ రెండింటికీ సంబంధం లేదని, దీపం పథకం యథావిధిగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఏళ్లు గడుస్తున్నా..
కరకగూడేనికి చెందిన ఈమె పేరు షేక్‌ ఫాతి మా. గ్యాస్‌ కనెక్షన్‌ కోసం ఎన్నోసార్లు అధికారులకు  దరఖాస్తులు అందజేసింది. ఏళ్లు గడుస్తున్నా నేటికీ మంజూరు కాలేదు. కట్టెల పొయ్యి కింద వంట చేస్తూ పొగ బారి న పడుతోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి గ్యా స్‌ ఇప్పిం చాలని వేడుకుం టోంది.

మరిన్ని వార్తలు