ప్రసవ వేదన.. ప్రాణ తపన

3 Feb, 2020 10:36 IST|Sakshi
కుక్కల దాడిలో మృతిచెందిన జింక

మూగజీవిపై దాడి చేసిన శునకాలు  

గర్భస్థ పిల్ల జింక సహా తల్లి మృత్యువాత

హెచ్‌సీయూ పరిసరాల్లో ఘటన

రాయదుర్గం: ప్రసవవేదన వేళ ఓ జింకపై శునకాలు దాడి చేయడంతో గర్భస్థ జింక సహా తల్లి జింక మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిసరాల్లో ఆదివారం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో వందలాది మూగజీవాలు జీవనం సాగిస్తున్నాయి. వాటికి అనువైన వాతావరణం కల్పించడంలోనూ హెచ్‌సీయూ పాలకవర్గం, విద్యార్థులు, వైల్డ్‌లెన్స్‌ గ్రూపు సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడడప్పుడు కుక్కలు, వేటగాళ్ల బారిన పడి మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా  హెచ్‌సీయూ క్యాంపస్‌ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది క్యాంపస్‌లోని నల్లగండ్ల చెరువు ఫెన్సింగ్‌ను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ మృత్యువాత పడిన జింక కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న వైల్డ్‌లెన్స్‌ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. జింకను పరిశీలించగా.. అది ప్రసవ వేదన పడుతుండే సమయంలో కడుపులోపలి జింక తలభాగం బయటకు వచ్చిన సమయంలో కుక్కలు వెంబడించి దాడికి దిగాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే సమయంలోనే ప్రసవమయ్యే అవకాశం ఏర్పడటంతో అది అటూఇటూ అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే కుక్కలు వెంబడించగా నల్లగండ్ల చెరువు వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తరుణంలో అవి దాడి చేయడంతో తాను ప్రాణాలు వదలడంతోపాటు పుట్టబోయే జింకపిల్ల కూడా తల బయటకు వచ్చేస్తున్న తరుణంలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. 

సమాచారం అందించినా..
జింక మృత్యువాత పడిన ఘటన వివరాలను చిలుకూరులోని అటవీ శాఖ అధికారులకు మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలోనే జింకను ఉంచి అక్కడే హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, వైల్డ్‌లెన్స్‌ గ్రూపు ప్రతినిధులు సాయంత్రం 6.30 గంటల వరకు వేచి ఉన్నారు. కానీ అటవీశాఖాధికారులు అప్పటికీ చేరుకోలేదు. వారి నిర్లక్ష్యం పట్ల హెచ్‌సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హెచ్‌సీయూలో కుక్కల బెడద నుంచి మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. గతంలోనూ పలు సంఘటనలు  చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో కుక్కలు సంచరిస్తున్నాయని,  వాటిని క్యాంపస్‌ బయటకు వదలిపెట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు