అడవి దొంగలు

22 Oct, 2019 10:12 IST|Sakshi

ఇష్టారీతిన చెట్ల నరికివేత 

గుట్టు చప్పుడు కాకుండా కలప రవాణా 

యథేచ్ఛగా బొగ్గుబట్టీల నిర్వహణ 

చోద్యం చూస్తున్న అధికారులు 

అక్రమార్కులపై చర్యలు అంతంతే.. 

అడవులతోనే మానవ మనుగడ. అలాంటి అడవి అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలవుతోంది. ఇష్టారీతిన చెట్లను నరికివేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కలపను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో చెట్లు లేక అడవి వెలవెలబోతోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అటవీ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. 
  
జిల్లాలో అటవీ శాఖలో విధులు నిర్వహించే ఇంటి దొంగలు ఎక్కువవుతుండటంతో చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. సామాజిక అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుండగా మరో పక్క యథేచ్ఛగా కలప తరలిపోతోంది. అధికారులు, సిబ్బంది కలప స్మగ్లర్లతో లాలూచి పడి అందిన కాడికి అడవులను అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దొరికితేనే వేటు అన్నచందంగా మారింది. గత రెండు మాసాల క్రితం ఫరీద్‌పూర్‌ అటవీ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కలపనునరికి ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గుబట్టిలను పెట్టారు. దీని వెనుకాల ఓ క్షేత్రస్థాయి అధికారి ఉన్నట్టు తెలుస్తోంది.

నర్దన అడవి నుంచి కలప రవాణ 
సర్దన నుంచి బోదన్కు‌ వెళ్లే దారి పొడవునా అడవి ఉంది. ఈ అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. చెట్లను నరికేసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయంటే మారుమూల పల్లెల్లోని అడవుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పాతూర్‌ అడవిలో.. 
మెదక్‌ – రామాయంపేట ప్రధాన రహదారైన పాతూర్‌ అడవిలో చెట్లను విచ్చలవిడిగా నరికివేశారు. అడవి లోపలికి కొద్దిదూరం వెళ్తే అన్ని నరికేసిన చెట్ల మొదళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, అటవీ అధికారులకు ఎంతో కొంత ఇస్తే ఏ చెట్టునైనా నరుక్కుపొమ్మంటారని కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా అడవి లోపలికి వెళ్లి చెట్లను నరకటం ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి.  

అడవిలో పడేసిన మొక్కలు 
హరితహారం పథకంలో భాగంగా ఇటీవల అటవీ శాఖ అధికారులు అడవుల్లో గ్యాబ్‌ ప్లాంటేషన్‌  విరివిగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని అడవుల్లో మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే పాతూర్‌ అడవిలో  అధికారులు కొంతమేర గ్యాబ్‌ ప్లాంటేషన్‌ చేసినప్పటికీ నాటిన మొక్కల కన్నా రెట్టింపు మొక్కలు అడవిలో ఎక్కడ పడితే అక్కడే పడేశారు. దీంతో అవి ఎండిపోయాయి. వీటిని చూస్తుంటే మన అటవీ శాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

వాహనాలు ఇచ్చినా ఫలితం శూన్యం 
అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో బీట్‌ ఆఫీసర్ల నుంచి మొదలుకొని సెక్షన్, రేంజ్‌ అధికారులకు ప్రభుత్వం వాహనాలను సమకూర్చింది. నిత్యం అడవుల్లో పర్యటిస్తూ అడవిని రక్షిస్తారని ఇచ్చిన వాహనాలను వారి సొంతానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశించినా.. 
ఇటీవల కలెక్టర్‌ ధర్మారెడ్డి అడవుల్లోకి ఎవరైనా గొడ్డలి పట్టుకొని లోపలికి పోయినా కేసులు నమోదు చేయాలని స్పష్టంగా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారిచేశారు. కానీ మన అధికారులు ఎవరిపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే మన అధికారులే అక్రమార్కులకు కొండంతా అండగా ఉంటున్నారు కాబట్టి. ఇక కలెక్టర్‌ చెప్పిన మాటలకు తలాడించి బయటకు రాగానే వారిపని వారు యథావిధిగా చేసుకుంటున్నారు.

అడవుల జోలికొస్తే చర్యలు తప్పవు 
అడవులను ఎవరు నరికినా చట్టరీత్య చర్యలు తప్పవు. సొంత పొలం గెట్ల నుంచి అక్రమంగా కలపను నరికినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయి అధికారులు స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు అడవుల రక్షణకు పాటు పడల్సిందే.. లేదంటే చర్యలు తప్పవు. గతంలో అడవులను నరికిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం. గడిచిన రెండేళ్లలో అడవిలో జిల్లా వ్యాప్తంగా 222 కేసులు నమోదు చేశాం. రూ.31.45 లక్షల జరిమానా విధించాం. 2018లో 169 కేసులు నమోదు చేసి అక్రమార్కుల నుంచి రూ.22.84 లక్షల జరిమానాలు విధించాం. 2019లో సెప్టెంబర్‌ వరకు అక్రమార్కులపై 53 కేసులు నమోదు చేసి రూ.8.61 లక్షలు జరిమానాలు విధించాం.  – పద్మజారాణి, డీఎఫ్‌వో   

మరిన్ని వార్తలు