త్వరలో డిగ్రీ ఫలితాలు

30 Apr, 2016 04:59 IST|Sakshi

తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మార్చిలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలు సాధ్యమైనంత తొందరగా ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. శుక్రవారం డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న స్పాట్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. స్పాట్ కేంద్రంలో మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి ఫలితాలు తొందరగా ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన పరీక్షల నియంత్రణ విభాగాధికారులను ఆదేశించారు. ఎకనామిక్స్ సబ్జెక్టు మూల్యాంకనంతో పాటు ప్రభుత్వ పాలన శాస్త్ర సబ్జెక్టు మూల్యాంకనం ముగిసిందన్నారు.

మేథమెటిక్స్, హిస్టరీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని రిజిస్ట్రార్ తెలిపారు. కొత్తగా స్పాట్ వాల్యూయేషన్‌కు వస్తున్న అధ్యాపకులు అప్రమత్తతతో మూల్యాంకనం చేయాలని, ఎలాంటి అజాగ్రత్తకు తావీయరాదని రిజిస్ట్రార్ సూచించారు. విద్యార్థులకు ఫైనల్ ఫలితాలు త్వరగా ఇస్తే ఇతర పోటీ పరీక్షలకు అర్హత లభిస్తుందని, వారు ఎన్నో పరీక్షలు రాసుకునే వీలు కలుగుతుందన్నారు. స్పాట్ కేంద్రంలో మంచి సౌకర్యాలతో పాటు బార్ కోడింగ్ ప్రక్రియతో ఆధునిక టెక్నాలజీ వాడకంపై ఆయన సీవోఈ పాత నాగరాజు, అసిస్టెంట్ కంట్రోలర్స్ లావణ్య, రాంబాబు, బాల్‌కిషన్‌లను అభినందించారు.

మరిన్ని వార్తలు