ఏప్రిల్‌ 30లోగా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు 

19 Jun, 2019 02:49 IST|Sakshi

విద్యా సంవత్సరం ప్రారంభం,పీజీ ప్రవేశాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు 

సాక్షి కథనంపై స్పందించిన ఉన్నత విద్యా మండలి 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి ఏప్రిల్‌ 30వ తేదీలోగా డిగ్రీ మూడో సంవత్సర పరీక్షలు పూర్తయ్యేలా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని రకాల చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్‌ నెలాఖరు వచ్చినా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయని, జూలైలోనూ కొన్ని యూనివర్సిటీల్లో వార్షిక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.

కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలో గందరగోళం నెలకొందని ‘సీబీసీఎస్‌ అమలులో గందరగోళం’శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పదించిన పాపిరెడ్డి.. పాలనాపరమైన అంశాల వల్ల కొన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ వార్షిక పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని యూనివర్సిటీల్లో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) పక్కాగా అమలు చేసేలా, సెమిస్టర్‌ పరీక్షలను సకాలంలో నిర్వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈమేరకు కామన్‌ అకడమిక్‌ కేలండర్‌ అమలుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఉండకుండా చర్యలు చేపట్టామని, పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టంచేశారు.   

మరిన్ని వార్తలు