నవంబర్‌ 24 నుంచి డిగ్రీ తొలి సెమిస్టర్‌ పరీక్షలు

23 Aug, 2016 03:03 IST|Sakshi
నవంబర్‌ 24 నుంచి డిగ్రీ తొలి సెమిస్టర్‌ పరీక్షలు

నవంబర్‌ 15 నుంచి ప్రాక్టికల్స్‌
  అక్టోబర్‌ 2 నుంచి 16 వరకు దసరా సెలవులు
ఆ సమయంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించుకోవాలి
  డిగ్రీలో సీబీసీఎస్‌ అమలుపై వీసీలతో పాపిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నవంబర్‌ 24 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలను అదే నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిగ్రీలో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌)ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చామన్నారు. అందులో భాగంగానే డిగ్రీలో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. సీబీసీఎస్‌ అమలుపై సోమవారం వివిధ  వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లతో సమీక్ష నిర్వహించారు. మొదటి సెమిస్టర్‌కు నవంబరు 14 ఆఖరి పనిదినమని వెల్లడించారు.

అక్టోబర్‌ 2  నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయన్నారు. ఆ సమయంలో డిగ్రీ వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయినవారి కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించుకోవాలని వీసీలను ఆదేశించారు. సీబీసీఎస్‌ అమలులో భాగంగా ఏటా 2 సెమిస్టర్లు ఉంటాయని, ప్రతి సెమిస్టర్‌ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈసారి ఆన్‌లైన్‌ ప్రవేశాల వల్ల ఆలస్యం అయినందున ఇంటర్నల్‌ పరీక్ష ఈ సెమిస్టర్‌లో ఒకటే ఉంటుందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేయూ, ఓయూలకు నిధుల కొరత ఉందన్న విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని.. వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు, వీసీలు రామచంద్రం, రాజారత్నం, సాంబయ్య, సాయన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు