‘ఫీజు’ కోసం సమ్మె బాట!

1 Oct, 2016 01:26 IST|Sakshi

- డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల ప్రాథమిక నిర్ణయం
- ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించనందుకే..
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి. 2013-14 విద్యా సంవత్సరం నుంచి రావాల్సిన ఫీజు బకాయిల కోసం  ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సమ్మె అనివార్యమని చెబుతున్నాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ వేతనాలను చెల్లించాలంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు సమ్మెపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల విడుదలకు  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా, కాలేజీల యాజమాన్యాలతో మే 24న సమావేశంలోనూ చెప్పినా ఆయన ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

ఇటీవల యాజమాన్యాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలసి విన్నివించామని, అయినా ముందడుగు పడకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి రూ. 3,065 కోట్ల ఫీజు బకాయిలు ఉండగా, ప్రభుత్వం గతంలో రూ.1,050 కోట్లు మంజూరు చేసిందని, అయితే అందులోనూ రూ. 275 కోట్లను ఇంకా ఖజానాశాఖ విడుదల చేయలేదని  పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని, తమ పరిస్థితులను అర్థం చేసుకోవాలని డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ రమణారెడ్డి కోరారు. దసరా పండుగ వేళ.. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం ఆందోళన బాట పట్టారని, ప్రభుత్వం బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే తాము ఆందోళనకు దిగక తప్పని పరిస్థితి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు